Perni Nani:జగన్‌ను ఏకవచనంతో పిలుస్తావా.. పిలిచి చూడు, చిరంజీవి నీ గురించి చెప్పింది నిజమే : పవన్‌పై పేర్ని నాని ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవికి, పవన్‌కు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందన్నారు. తాను రాజకీయాలకు పనికి రానని, తమ్ముడు బాగా సెట్ అవుతారని చిరంజీవి గతంలోనే చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. చంద్రబాబు చెప్పినట్లు తాను చేయలేనని, పవన్ చేయగలడనే విషయం ఆయన అర్ధం చేసుకున్నాడని .. అందుకే చిరంజీవి అలా మాట్లాడారని పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబుతో జత కలవడం, అబద్ధాలు చెప్పడం, విషం చిమ్మడం చిరంజీవి వల్ల కాదని.. అలాంటివి పవన్ మాత్రమే చేయగలరని ఆయన విమర్శించారు. చిరంజీవి అలా ఎందుకు అన్నారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందని నాని సెటైర్లు వేశారు.
కాపుల ఓట్లు చీల్చాలనే 2019లో విడిగా పోటీ:
2019 ఎన్నికలకు ముందు కాపులు జగన్‌కు ఓట్లు వేస్తారేమోనని పసిగట్టి ఆరు నెలల ముందు చంద్రబాబును వదిలేసి.. కాపు వర్గం ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబుకు లబ్ధి కలిగేలా.. కాపు ఓట్లు జగన్‌కు రాకూడదని కుట్రలు చేశారని, కానీ కాపులు మాత్రం పవన్ కల్యాణ్ కుట్రలను పసిగట్టి జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్ని నాని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబుకు, పవన్‌కు భయం పట్టుకుందని.. జగన్ పాలనను వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అబద్ధాలు మాట్లాడనని చెప్పిన పవన్ .. అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. వాలంటీర్లలో ఎక్కువమంది మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారని.. అలాంటి వారిపై దిగజారిన మాటలు మాట్లాడుతారా అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయగలరా :
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామనే ధైర్యం చంద్రబాబుకు , పవన్‌కు వుందా అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటే వారిద్దరికి చలిజ్వరమని నాని వ్యాఖ్యానించారు. వైసీపీ ఏనాడు పవన్ తల్లి, భార్య గురించి తప్పుగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. 30 వేల మంది మహిళలు ఏపీ నుంచి అదృశ్యమయ్యారని పవన్ చెబుతున్నారని.. అందుకు ఎన్సీబీ రిపోర్ట్ అని చెబుతున్నారని, ఎన్‌సీబీ అంటే నారా చంద్రబాబు నాయుడు అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో 16,765 మంది మిస్ అయ్యారని.. అప్పుడెందుకు ప్రశ్నించలేదని నాని నిలదీశారు. రామోజీ రాస్తాడు.. చంద్రబాబు ఆ స్క్రిప్ట్ నీకిస్తాడు, నువ్వు లారీ ఎక్కి చదవేస్తావంటూ ఆయన సెటైర్లు వేశారు. నువ్వు జగన్‌ను ఏకవచనంతో పిలస్తే.. మేం అనేక వచనాలతో పిలవగలమని పేర్ని నాని హెచ్చరించారు. సీఎంను ఏకవచనంతో పిలుస్తానని చెప్పడం ద్వారా నీ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు తెలుసుకుంటారని నాని అన్నారు. చంద్రబాబు కాళ్లు మొక్కి, ఆయను సార్, అయ్యా, దొరా ఎలా పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. జగన్ చేసే అప్పుకు ప్రతి పైసాకు లెక్కా పత్రం వుందని ఆయన స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout