కోవిడ్ నేపథ్యంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్నాయి. అందుకు తగినట్లు ఓటీటీ మాధ్యమాల్లో సినిమాల విడుదల క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలో విడుదలైన మరో చిత్రం ‘మా వింతగాధ వినుమా’. కోవిడ్ టైమ్‌లో..ఆహా ఓటీటీలో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ..మరి ‘మా వింతగాధ వినుమా’తో ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
ఇంజనీరింగ్ చదివే కుర్రాడు సిద్ధు(సిద్ధు జొన్నలగడ్డ).. క్లాస్‌మేట్ వినీత(శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సిద్ధు ఆమెకు తన లవ్ చెప్తాడు. వినీత పెద్దగా పట్టించుకోదు. కానీ క్రమంగా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. అలా వాళ్ల రిలేషన్ షిప్ బలపడుతుంది. వినీత అన్నయ్య రాజేశ్(కమల్ కామరాజు) పెళ్లి కోసం రాజేశ్ జంట, సిద్ధు, వినీత, స్నేహితులు కలిసి గోవా వెళతారు. అక్కడే జరిగే పరిణామాల నేపథ్యంలో సిద్ధు, వినీతను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ పెళ్లి వీడియో వివాదాస్పదంగా మారుతుంది. పేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. దీంతో రెండు కుటుంబాలకు ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. ఇంతకీ పెళ్లి వీడియో ఎందుకు వివాదాస్పదమవుతుంది? సమస్యను సిద్ధు ఎలా పరిష్కరించుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
తన గత చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో స్టైల్లోనే సిద్ధు ఈ చిత్రంలోనూ ఇంజనీరింగ్ కుర్రాడిగా కనిపించాడు. జీవితం అంటే చిల్... అనుకునే డబ్బున్న కుర్రాడు ఆలోచనా శైలి.. లవ్ మేటర్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. తోచింది చేసుకుంటూ వెళ్లిపోతే చాలనే పంథాలో ఉండే మనస్తత్వం ఉండే కుర్రాడిని సిద్ధు తన పాత్రలో చూపించాడు. ఓ చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం. నిజానికి అలాంటి చిన్న సమస్యలు నిజంగానే పెద్ద ఇబ్బందులను కలిగిస్తాయి. అలాంటి ఓ ఇబ్బందికరమైన పరిస్థితి ఓ యువ జంటకు ఎదురైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ను ‘మా వింతగాధ వినుమా’ ద్వారా చెప్పే ప్రయత్నం. కానీ ఓ చిన్న పాయింట్‌ను బలంగా చెప్పాలంటే ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ సినిమాలో ఎక్కడా అది కనపడదు. ఏదో వెళ్లిపోతుందిగా అనేటట్లు చూపించారు. అటు, ఇటు తిప్పి ఇంతకూ ముందు చెప్పినట్లు చిల్ బాబు.. చిల్... అనుకునే లవ్‌స్టోరిలా సినిమా ఎక్కువ భాగం నడుస్తుంది. ఇక సెకండాఫ్‌లో సోషల్ మీడియా కారణంగా వచ్చే ఓ ఇబ్బందిని చెప్పే ప్రయత్నం. అది కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. దర్శకుడు ఆదిత్య ఈ విషయంలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. సాయిప్రకాశ్ విజువల్స్ బావున్నాయి. సిద్ధు, శీరత్ కపూర్, కమల్ కామరాజు, తనికెళ్లభరణి, జయప్రకాశ్.. ఇలా అందరూ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. కానీ సినిమాలో కనెక్టింగ్ ఎమోషనల్ పాయింట్ లేకపోవడంతో వీరి నటనకు పెద్ద ఆస్కారం లేనట్లే కనిపిస్తుంది. గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. ఏదో సినిమా చూశామనే భావన కలుగుతుందంతే..
చివరగా.. మా వింతగాధ వినుమా.. మిస్ అయిన ఎమోషన్స్
Comments