జగన్ వద్దకు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా, ఇండస్ట్రీ చూపంతా అటే

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై గత వారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత ఓ పదిరోజుల్లో గుడ్‌న్యూస్ వింటారంటూ చిరంజీవి, మహేశ్ తదితరులు మీడియాకు వివరించారు. అంతా బాగానే వున్న సమయంలో ఈ సమావేశానికి రాని సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో మంత్రి పేర్ని నాని ప్రత్యక్షం కావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఇది వ్యక్తిగత భేటీయేనని దీని వెనుక ఎలాంటి కారణాలు లేవని మంత్రి పేర్ని నాని, మోహన్‌బాబులు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పరిశ్రమలో పెద్దరికం కోసం చిరంజీవి, మోహన్‌బాబు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందంటూ టాక్ నడుస్తోంది. టాలీవుడ్ కష్టాలు తీర్చాలని ఎవరికి వారు విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చిరంజీవితో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు భేటీకానున్నారు. టికెట్ రేట్ల పెంపు, థియేటర్‌ సమస్యలతో అల్లాడుతోన్నప్పటికీ.. 'మా' అధ్యక్షుడి హోదాలో వున్న విష్ణు ఇప్పటి వరకూ జగన్‌ని కలవలేదు. ఈ నేపథ్యంలో తాజా భేటీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబధించిన సమస్యల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మంత్రి పేర్ని నానితో మోహన్‌బాబు భేటీపై విష్ణు చేసిన ట్వీట్స్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ - విష్ణు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విష్ణుకు జగన్ వరుసకు బావ అయినప్పటికీ... పరిశ్రమ సమస్యల మీద సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.