మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది సభ్యుల రాజీనామాలకు ఆమోదం

  • IndiaGlitz, [Sunday,December 12 2021]

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. వీరి స్థానంలో 11 మంది కొత్త వారిని తీసుకుంటామని మంచు విష్ణు ప్రకటించారు. 'మా' లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్‌ స్థానంలో బాబూమోహన్‌ను నామినేట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరమని గుర్తుచేశారు. వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నామని.. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్‌లు మా సభ్యులుగానే కొనసాగుతారని విష్ణు తెలిపారు. వారంలో మా భవనంపై ప్రకటిస్తామని.. మా భవనం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం జరిగిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. విష్ణు ప్యానల్‌ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆనాడే ప్రకటించిన విషయం తెలిసిందే. మొద‌ట‌ రాజీనామాలు చేయొద్దని, ఆ లేఖలు వెనక్కి తీసుకోవాలని విష్ణు కోరాడు. అయిన‌ప్ప‌టికీ వారు వినిపించుకోక‌పోవ‌డంతో వారి రాజీనామాల‌ను ఆమోదిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.