మా ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయను.. ఎన్టీఆర్ చెప్పిన మాట ఇదే: జీవితా రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సాధారణ ఎన్నికలను మించిన ఉత్కంఠ, వివాదాలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఫిలింనగర్ హీట్ ఎక్కుతోంది. రోజుకొక ప్యానెల్ మెంబర్ మీడియా ముందుకు వచ్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. నామినేషన్స్ తర్వాత చివరికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మాత్రమే బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక సినీ పెద్దలు, బడా హీరోల సపోర్ట్ ఏ ప్యానెల్‌కు వుంది...? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రకాశ్ రాజ్ విందు రాజకీయాలతో మా సభ్యులను ప్రసన్నం చేసుకుంటుకుండగా.. విష్ణు మాత్రం పెద్దల ఆశీర్వాదాల తీసుకుంటూ తనకు మద్ధతుగా వుండాలని కోరుతున్నాడు.
ఈ నేపథ్యంలో తనకు బాలకృష్ణ సపోర్ట్ అందిందని, అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆశీర్వాదం కూడా లభించిందని ఇప్పటికే మంచు విష్ణు ప్రకటించగా.. ప్రకాష్ రాజ్ మాత్రం తనకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదని బహిరంగంగానే పేర్కొన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్‌గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరం అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 'మా' ఎన్నికలపై ఆయన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయాన్ని జీవిత బయటపెట్టారు.
ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పిన జీవిత.. 'మా' ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి తనకు ఓటు వేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారని జీవిత తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందని , తాను మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు రానని ఎన్టీఆర్ తేల్చి చెప్పారని జీవిత వెల్లడించారు. దయచేసి తనను ఓటు అడగొద్దని ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లు నిజంగానే చిత్ర పరిశ్రమ పరిస్థితి కూడా అలాగే ఉందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మోహన్‌బాబు , విష్ణు అంటే కూడా తనకు ఎంతో గౌరవం అని చెప్పిన జీవిత.. విష్ణు తనకున్న సామర్థ్యంతో ఎన్నికల బరిలో నిలిచి నరేష్‌ను వెనకేసుకు తిరగడాన్ని మాత్రం తప్పుబట్టారు. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటూ జీవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments