శ్రీ విష్ణు కెరీర్‌లోనే అత్యంత బిగ్ బడ్జెట్ చిత్రం `మా అబ్బాయి`. స్వతహాగా రిజర్వ్ డ్ గా కనిపించే శ్రీ విష్ణు ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో చాలా ఈజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. `మా అబ్బాయి` అని ఫక్తు ఫ్యామిలీ టైటిల్‌తో తాజాగా ప్రేక్షకులను పలకరిస్తున్నారు. సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఉంటుందా? కొత్త నిర్మాత బలగ ప్రకాష్‌రావుకి కాసులు రాలుతాయా? తొలి చిత్ర దర్శకుడు కుమార్ వట్టికి `మా అబ్బాయి` ఇండస్ట్రీలో విజిటింగ్ కార్డులాగా పనికొస్తుందా? చదివేయండి మరి...
కథ:
పెళ్లీడుకొచ్చిన కొడుకు (శ్రీ విష్ణు), పెళ్లి కుదిరిన కూతురితో ఆనందరావు(కాశీ విశ్వనాథ్) దంపతులు హైదరాబాద్‌లో నివశిస్తుంటారు. ఉన్నంతలో ఆనందంగా బతికే మధ్య తరగతి కుటుంబం వారిది. కూతురి పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని సాయిబాబాను దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తారు. అక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయి. అబ్బాయి తప్ప మిగిలిన ముగ్గురూ ప్రాణాలు విడుస్తారు. దాంతో కసితో చెలరేగిన అబ్బాయి సంఘవిద్రోహ శక్తులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? కండబలానికి బుద్ధి బలం కూడా తోడైతే ఎలా ఉంటుందనేది సినిమా కాన్సెప్ట్. ఎదురింటి అమ్మాయిగా హీరోయిన్ (చిత్ర శుక్ల) పరిచయమవుతుంది. తన కుటుంబానికి నచ్చిన అమ్మాయి, అందులోనూ తన సోదరికి నచ్చిన అమ్మాయి కావడంతో ఆమెను ప్రేమిస్తూ `అమ్మడూ` అంటూ వెంటపడి ప్రేమను దక్కించుకుంటాడు హీరో. ఈ రెండు అంశాలను సంధానం చేస్తూ సాగే సన్నివేశాల సమాహారమే `మా అబ్బాయి`.
ప్లస్ పాయింట్స్:
హీరోకున్న మార్కెట్‌ను మించి నిర్మాత పెట్టిన ఖర్చు ప్రతి సీన్‌లోనూ, షాట్‌లోనూ తెలుస్తూనే ఉంటుంది. శ్రీవిష్ణు తనపనిని సులువుగా చేసుకుపోగలిగాడు. ఈ చిత్రంలో డ్యాన్సులు కూడా కొంతవరకు ట్రై చేశాడు. కెమెరాపనితనం కంటికింపుగా ఉంది. సురేశ్ సంగీతం చేసిన పాటలు బావున్నాయి. హీరోయిన్ తన పరిధిలో చక్కగానే నటించింది. హీరో తల్లిదండ్రులుగా కాశీ విశ్వనాథ్, సన ఒదిగిపోయారు.
మైనస్ పాయింట్స్:
సినిమా కొన్ని చోట్ల నాన్‌సింక్‌గా అనిపిస్తుంటుంది. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన ఎదురింటి అమ్మాయిని తన కొడుక్కి కాఫీ ఇవ్వమని సాధారణ గృహిణిలు పురమాయించరు. కుటుంబంలో యావన్మందిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన వ్యక్తిని ఏ అమ్మాయీ తేలిక మాటలనే సాహసం చేయదు. ఈ రెండు విషయాలు మచ్చుకు చెప్పినవే. ఇలాంటి పొంతన లేకుండా ఉన్న అంశాలు చాలానే ఉంటాయి. హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పిన తీరు కూడా బాగాలేదు. సినిమాల్లో హీరో మాటల్లో ఉండే ఇంటెన్స్ సన్నివేశాల్లో కనిపించదు. బలహీనమైన సన్నివేశాలు, కథనం చాలా చోట్ల విసుగు తెప్పిస్తుంది. కామెడీ మచ్చుకైనా లేదనే చెప్పాలి. ఈ తరహా సినిమాలకు ఎడిటింగ్, రీరికార్డింగ్ ప్రాణంగా నిలుస్తుంది. ఆ రెండు విభాగాల్లోనూ సంపూర్ణమైన నాణ్యత కొరవడింది.
విశ్లేషణ:
బాంబు పేలుళ్ల నేపథ్యంలో వచ్చిన సినిమాలు మనకు కొత్తేమీ కాదు. సర్వం కోల్పోయిన హీరో పైకి మామూలుగా కనిపిస్తూ లోలోపల ఎవరికీ తెలియకుండా సంఘవిద్రోహ శక్తుల పనిపట్టడమనేది తెలుగు స్క్రీన్ మీద కొత్తేమీ కాదు. ఈ చిత్రంలో అదే విషయం కనిపించినా దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నాలు ఎక్కడా చేయలేదు. క్లైమాక్స్ లో ఒకటీ, రెండు సన్నివేశాల్లో తప్ప చెప్పుకోదగ్గ ట్విస్టులు కూడా ఏమీ ఉండవు.
హీరో, హీరోయిన్ల మధ్య కూడా ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. చెప్పాలనుకున్న విషయాన్ని సరైన సీన్లతో, బలంగా, కన్విన్సింగ్‌గా చెప్పడంలో ఎక్కడో లోపం జరిగిందన్నది స్పష్టం. బాంబు బాధితుల కష్టాలను వింటున్నప్పుడు, ఆ దృశ్యాలను తెరపై చూస్తున్నప్పుడు మాత్రం సహృదయులకు గుండె తడిబారకమానదు. ఆ తరహా సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడు మెప్పించగలిగాడు.
బోటమ్ లైన్: మా అబ్బాయి.. పగ, ప్రతీకారాలకే పరిమితం...
Comments