టాలీవుడ్‌లో విషాదం.. వెన్నెలకంటి కన్నుమూత
- IndiaGlitz, [Tuesday,January 05 2021]
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నలకంటి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ఆయన మృతి చెందారు. వెన్నెలకంటి అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎన్నో సినిమాలకు ఆయన ఆణిముత్యాల వంటి పాటలను అందించారు. ఆయన మృతి వార్తతో సిని పరిశ్రమ ఒకింత షాక్‌కు గురైంది. సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
వెన్నెలకంటి గురించి..
వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్. జన్మస్థలం నెల్లూరు. విద్యాబ్యాసం మొత్తం సొంత జిల్లాలోనే పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే సాహిత్యమంటే అభిమానమున్న ఆయన తన 11 ఏట భక్త దు:ఖనాశ పార్వతీశా’ అనే శతకాన్ని రాశారు. అలా ఎన్నో నాటకాలు వేసిన ఆయన.. ఎస్బీఐలో ఉద్యోగం కూడా చేశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’ మూవీలో ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెలజ జోల’ అనే పాట రాశారు. సుమారు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. ‘ఆదిత్య 369’, ‘ఘరానా అల్లుడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘క్రిమినల్’, ‘సమరసింహారెడ్డి’, ‘టక్కరి దొంగ’, ‘వస్తాడు నా రాజు’, ‘చెప్పాలని ఉంది’తో పాటు పలు హిట్ సినిమాలకు వెన్నెలకంటి సాహిత్యం అందించి సూపర్ డూపర్ హిట్టవ్వడంలో కీలక పాత్ర పోషించారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలో ఆయన పేరుగాంచారు. అంతేకాదు కొన్ని చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. ఇలా తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. చివరగా గతేడాది పెంగ్విన్ చిత్రానికి ఆయన లిరిక్ రైటర్‌గా పనిచేశారు.
కాగా.. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో వెన్నెలకంటికి అవినాభావ సంబంధాలున్నాయి. గత ఏడాది ఎస్పీబీ కన్నుమూయడానికి ముందు కరోనాపై ఆయన పాడిన పాటను కూడా వెన్నెలకంటి రాజేశ్వరరావే రాశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెల కంటి కూడా సినీ రచయితగానే ఉండగా.. చిన్న కుమారుడు రాకేందు మౌళి నటుడిగా, రిలిక్స్ రైటర్‌గా, సింగర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.