ఇంకా విధుల్లో చేరని ‘ఎల్వీ’.. అసలేం జరుగుతోంది!
- IndiaGlitz, [Wednesday,November 06 2019]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏరి కోరి మరీ తెచ్చుకున్న ఈయన్ను అసలెందుకు బదిలీ చేశారో.. అది కూడా సీఎస్ హోదా నుంచే బదిలీ చేయడంపై రోజురోజుకూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే.. సీఎస్ నుంచి గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు.
అయితే ఉత్తర్వులు జారీ చేసి 48 గంటలు గడిచినప్పటికీ ఆయన మాత్రం ఇంతవరకూ విధుల్లో చేరలేదు. అంతేకాదు.. కనీసం బాధ్యతలు కూడా స్వీకరించకపోవడం గమనార్హం. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టి వెళ్లిపోవడంతో ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుసుకోవచ్చు!. అయితే ఆయన అసలు విధుల్లో చేరతారా..? లేకుంటే చేరకుండా విరమణ తీసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఎల్వీ మనసులో ఏముందో తెలియాలంటే వచ్చే నెల 6 వరకు వేచి చూడాల్సిందే మరి.