LV Gangadhara Sastry:భగవద్గీతకే జీవితం అంకితం ..17 ఏళ్ల కృషికి గుర్తింపు : ఎల్‌వీ గంగాధర శాస్త్రికి "గౌరవ డాక్టరేట్"
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రసిద్ధ గాయకులు, గీతాగాన, ప్రవచన ప్రచారకర్త ఎల్‌వీ గంగాధర శాస్త్రికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వున్న "మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం" "గౌరవ డాక్టరేట్ "ను ప్రకటించింది. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగా భగవద్గీతలోని 700 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గంగాధర శాస్త్రి. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు గంగాధర శాస్రి కి "గౌరవ డాక్టరేట్ "ను ప్రకటిస్తున్నట్లు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేశారు. మే 24 ఉదయం 11 గంటలకు ఉజ్జయినిలో కాఠీ మార్గ్ లో వున్న విక్రం కీర్తి మందిరంలో జరిగే మహర్షి పాణిని సంస్కృత్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవంలో గంగాధర శాస్త్రికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
మురళీధర్ రావుకు స్పెషల్ థ్యాంక్స్ :
ఈ సందర్భంగా తనకు దక్కిన గౌరవంపై గంగాధర శాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్, యూనివర్సిటీ కులపతి మంగుభాయ్ పటేల్‌కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి విజయ్ కుమార్‌కి, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు , ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి మోహన్ యాదవ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 'భగవద్గీతా ఫౌండేషన్ ' ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ పి . మురళీధరరావు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్లే తనకీ గౌరవం దక్కిందన్నారు గంగాధర శాస్త్రి. అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర శాస్త్రి చెప్పారు.
ఈ డాక్టరేట్ వారికి అంకితం :
సంస్కృత వ్యాకర్త అయిన 'పాణిని మహర్షి ' పేరుతో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవం - తనకు తల్లి దండ్రులకు, తన 17 ఏళ్ల భగవద్గీతా ప్రయాణంలో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, ప్రపంచం నలుమూలల నుండి తనకు చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందన్నారు. తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి తెలిపారు.
భగవద్గీతను పిల్లలకు నేర్పాలన్న గంగాధర శాస్త్రి:
స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా 'భగవద్గీత ' పునాదులపై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ 'భగవద్గీతా ఫౌండేషన్ ' ద్వారా గీతా ప్రచారంతో పాటు పేద విద్యార్థులకు, అనాధ బాలలకు వికలాంగులకు , వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్నామని గంగాధర శాస్త్రి వెల్లడించారు. అలాగే గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ, ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గంగాధర శాస్త్రి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవాక్షేత్రంగా తెలుగునాట ' భగవద్గీతా యూనివర్సిటీ ' స్థాపనే లక్ష్యంగా 'భగవద్గీతా ఫౌండేషన్' కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కులమతాలకు అతీతమైన జ్ఞాన గ్రంధం 'భగవద్గీత'ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలని గంగాధర శాస్త్రి కోరారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments