ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు..
- IndiaGlitz, [Friday,October 16 2020]
ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. గురువారం రాత్రి ప్రకటన జారీ చేసే సమయం వరకూ 19.33 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత నాలుగు రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు చోట్ల పవర్ కట్స్, ఇంటర్నెట్ సరిగా లేనందున గడువు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి పలు ఫిర్యాదు వచ్చాయని.. దీంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్ వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోవడానికి వీలు పడలేదని సీఎస్ తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్.. మున్సిపల్, పంచాయతీరాజ్ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఎల్‌ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.