Lovers Day Review
సినిమాల్లో క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడాలి. అలాంటిది కొందరికి అలాంటి క్రేజ్ ఒకట్రెండు సినిమాలతోనే దక్కుతుంది. అయితే ఒక సినిమా కూడా విడుదల కాకుండానే నేషనల్ రేంజ్‌లో రాత్రికి రాత్రే క్రేజ్ సొంతం కావడం అంటే మాటలు కావు. అలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం `ఒరు ఆడార్ లవ్`లో ఓ సీన్ ఈమెకు నేషనల్ రేంజ్ గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో తొలి సినిమా విడుదల కాకపోయినా, ఆమెతో సినిమా చేయడానికి మన దర్శక నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. ఈ వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ నటించిన `ఒరు ఆడార్ లవ్` ప్రేమికుల రోజున `లవర్స్ డే`గా విడుదలైంది. మరి ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ నటన ఎలా మెప్పించింది? సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం.
కథ:
డాన్ బాస్కో స్కూల్లో జూనియర్ ఇంటర్ చదువుతుంటారు రోషన్, ప్రియ, గాథ, మాథ్యూ తదితరులు. కాలేజీలో సరదాగా పుట్టే ప్రేమ రోషన్, ప్రియ మధ్య పుడుతుంది. కన్ను కొట్టడంతో మొదలై ముద్దులు పెట్టుకోవడం వరకు సాగుతుంది. ఒకరకంగా ప్రేమ ఫలించడానికి రోషన్‌కు గాథ సాయం చేస్తుంది. గాథకు ప్రేమ పట్ల పెద్ద నమ్మకం ఉండదు. అయితే ఓ సారి అనుకోకుండా కొన్ని న్యూడ్ వీడియోస్ రోషన్ వాట్సాప్ నెంబర్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూపులోకి అప్‌లోడ్ అవుతాయి. అతనికి వారం రోజులు సస్పెన్షన్ ఇస్తారు. ఆ సమయంలో అతన్నుంచి ప్రియ తప్పుకుంటుంది. అతనికి దూరమవుతుంది. కానీ గాథ దగ్గరై సమస్యను పరిష్కరిస్తుంది. ప్రియ మునుపటిలా రోషన్‌ను ప్రేమించాలంటే ఆమెలో ఈర్ష్య పుట్టాలని, అందుకు రోషన్‌ని గాథ ప్రేమిస్తున్నట్టు నటిస్తే బావుంటుందని ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు. సో గాథ, రోషన్ ఇద్దరూ లవ్‌లో ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. కానీ ఆ క్రమంలో వాళ్లు నిజంగా లవ్ ఫీల్ కావడం మొదలుపెడతారు. సో ఆ తర్వాత ఏమైంది? అనేది బ్యాలన్స్ స్టోరీ.
ప్లస్ పాయింట్లు:
ప్రియా వారియర్ తన పరిధి మేరకు బాగానే నటించింది. కనుబొమ్మలు పైకెత్తి కన్ను కొట్టడం, వేలితో గన్నులా చేసి తుపాకిని పేల్చినట్టు పేల్చడం వంటివన్నీ బాగానే చేసింది. పొసెసివ్ గర్ల్ గా బాగానే పెర్పార్మ్ చేసింది. మిగిలిన నటీనటులు కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా నూరిన్ స్క్రీన్ మీద లైవ్లీగా అనిపించింది. సరదా సరదాగా నవ్వుతూ తుళ్లుతున్నంత సేపు ఎంత చక్కగా చేసిందో, ఆఖరిన ఏడుపు సన్నివేశాల్లోనూ అంతే బాగా చేసింది. అక్కడక్కడా రీరికార్డింగ్, పాటలు బావున్నాయి. స్కూల్లో టీచర్ల మధ్య ఈర్ష్య, సరదా సన్నివేశాలు మెప్పిస్తాయి.
మైనస్ పాయింట్లు:
ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ హీరోయిన్ అని అనుకుని సినిమాకు వెళ్లినవారికి నిరాశ తప్పదు. పాటలు కూడా మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు. ఈ తరహా కాలేజీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ముక్కోణపు ప్రేమ కథలు కూడా కొత్తకాదు. మలయాళీలు మెచ్చే సహజత్వం తెలుగువారికి పెద్దగా నచ్చదు. మలయాళంలో క్లైమాక్స్ సన్నివేశాలకు మంచి గుర్తింపు వస్తుందేమో కానీ, తెలుగు కోసమైనా క్లైమాక్స్ ని మార్చాల్సింది. హీరో ముఖంలో పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. స్క్రీన్ ప్లేలోనూ మ్యాజిక్ ఏమీ లేదు.
విశ్లేషణ:
సినిమాకు మరింత క్రేజ్ రావడం కూడా చాలా సందర్భాల్లో మైనస్ అవుతుందేమో. ప్రియా ప్రకాష్ వారియర్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే `లవర్స్ డే` కథను ఒమర్ లులు మార్చారని అప్పట్లో టాక్ వినిపించింది. సినిమా చూస్తే అది నిజమేనేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే కథగా ఈ సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు. `హ్యాపీడేస్` లాంటి కాలేజీ స్టోరీస్ చూసిన మనకు ఇలాంటి సినిమాలు కొత్తకాదు. `జయం`, `చిత్రం` సినిమాలను దశాబ్దాలకు ముందే చూసిన తెలుగు ప్రేక్షకులకు `లవర్స్ డే` లో స్పెషల్‌గా చూడాల్సింది పెద్దగా ఏమీ ఉండదనడమే సబబు. ఫస్టాఫ్‌లోనూ సాగదీత సన్నివేశాలే ఉంటాయి. క్లైమాక్స్ కాస్త కుర్చీలో కుదురుగా కూర్చునేలా చేసిందనే మాట వాస్తవం. అయితే అలాంటి క్లైమాక్స్ లను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఇష్టపడతారనేది ప్రశ్నే. వేలంటైన్స్ డే రోజు స్క్రీన్ మీద ఫ్రెష్ లవ్ ని ఫీల్ కావాలనే అనుకుంటారు తప్ప, ఎక్కడో ఏదో అయిపోయినట్టు చూడ్డానికి ఎందరు ఇష్టపడతారనేది ఆలోచించాల్సిన విషయం. పైగా రోషన్‌కీ, ప్రియకు మధ్య పుట్టిన ప్రేమలోనూ ఎక్కడా ఇంటెన్స్ ఉండదు. వాళ్లిద్దరూ విడిపోయినప్పుడూ మనకు ఆ ఇంటెన్స్ తెలియదు. మనకు కాదు కదా.. వాళ్లిద్దరికీ కూడా అది తెలిసినట్టు అనిపించదు.
బాటమ్ లైన్: మరీ రొటీన్‌గా.. 'లవర్స్ డే'
Read Lovers Day Movie Review in English
- Read in English