Download App

Lover Review

స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌గా పేరున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన 28వ చిత్రం `ల‌వ‌ర్‌`.  `అలా ఎలా`తో స‌క్సెస్ కొట్టిన అనీశ్ కృష్ణ  దాదాపు మూడేళ్ల‌ త‌ర్వాత డైరెక్ట్ చేసిన చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాను దిల్‌రాజు, శిరీశ్ కాకుండా వారి త‌ర్వాత త‌రానికి చెందిన హ‌ర్షిత్ రెడ్డి నిర్మించ‌డం. త‌న బ్యాన‌ర్‌లో సినిమా నిర్మించ‌డానికి శ‌త ఆలోచ‌న‌లు చేసే దిల్‌రాజుకి ల‌వ‌ర్ ఎలాంటి గుర్తింపు తెచ్చింది?  నిర్మాతగా హ‌ర్షిత్ తొలి ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ సాధించాడా?  అలా  ఎలా`తో హిట్ కొట్టిన అనీశ్ ద్వితీయ విఘ్నాన్ని `ల‌వ‌ర్‌` అధిగ‌మించాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

స్వంత బైక్ గ్యారేజ్‌తో మెకానిక్‌గా హ్యాపీగా ఉండే రాజ్‌(రాజ్‌త‌రుణ్‌)కి చిన్న‌ప్పుడే త‌ల్లి చనిపోతుంది. అన్న‌య్య జ‌గ్గూబాయ్(రాజీవ్ క‌న‌కాల‌)..స్నేహితులు(ప్ర‌వీణ్‌, స‌త్య‌, స‌త్యంరాజేశ్‌)ల‌తో సంతోషంగా ఉంటాడు. దందాలు చేసే సంప‌త్(సుబ్బ‌రాజు)తో ఉండ‌టం వ‌ల్ల జ‌గ్గుపై ఏటాక్ జ‌ర‌గుతుంది. అన్న‌య్య‌ను కాపాడే క్ర‌మంలో రాజ్ చేతికి గాయ‌మవుతుంది. హాస్పిట‌ల్ వెళ్లిన రాజ్‌.. అక్క‌డ చ‌రిత‌(రిద్దికుమార్‌)ను చూసి ప్రేమిస్తాడు. త‌న స్నేహితులు స‌హ‌కారంతో ఆమె ప్రేమ‌ను కూడా పొందుతాడు. క‌థ ఇలా సాగే క్ర‌మంలో చరిత‌ను కోయం బ‌త్తూర్‌కి చెందిన రౌడీ(అజ‌య్‌).. త‌న మావ‌య్య‌(స‌చిన్ ఖేడేక‌ర్‌) కోసం కిడ్నాప్ చేయాల‌నుకుంటాడు. రాజ్ స‌హాయంతో చ‌రిత త‌ప్పించుకుంటుంది. చరిత సొంత రాష్ట్రం కేర‌ళ‌కు ఓనం పండుగ సంద‌ర్భంగా రాజ్ ఆమెతో వెళ‌తాడు. అక్క‌డే త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని ఆమె త‌ల్లికి చెప్పి.. ఆమె అంగీకారాన్ని పొంది చ‌రిత‌తో ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడు. ఆ స‌మ‌యంలో కోయంబ‌త్తూర్‌కి చెందిన రౌడీ, అత‌ని మ‌నుషులు చ‌రిత‌పై ఏటాక్ చేస్తారు. అడ్డం వ‌చ్చిన జ‌గ్గూభాయ్‌ని చంపేసి.. చ‌రితను ఎత్తుకెళ్లిపోతారు. చ‌రిత‌ను కాపాడుకోవ‌డానికి రాజ్ ఏం చేశాడు?  విల‌న్స్ భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు?  అనే సంగ‌తులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ రొటీన్ ప్రేమ‌క‌థ‌లో సెకండాఫ్‌ను న‌డిపిన తీరు బావుంది. ముఖ్యంగా సెంట‌ర్ పాయింట్ హీరో.. హీరోయిన్‌నో కాకుండా మ‌రో అమ్మాయి చుట్టూ ఫోక‌స్ చేయ‌డం ట్విస్ట్‌. అలాగే క్లైమాక్స్‌లో విల‌నిజాన్ని హీరో తెలివిగా ఎలా హ్యాండిల్ చేశాడ‌నేది ద‌ర్శ‌కుడు లాజిక్‌తో చూపిండం ఆక‌ట్టుకుంటుంది. అలాగే స‌మీర్ రెడ్డి కెమెరా ప‌నితనం సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. ముఖ్యంగా సెకండాప్‌లో కేర‌ళ అందాల‌ను మ‌రింత అందంగా చూపించారు. సంగీత ద‌ర్శ‌కుల లిస్ట్ చాలానే ఉంది. ట్యూన్స్ విష‌యంలో ఏదో చిలిపి క‌ల‌... పాట‌తో పాటు.. అంతే క‌దా  సాంగ్స్ బావున్నాయి.. సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ బావుంది. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి రెండు, మూడు స‌న్నివేశాలు మిన‌హా ఎడిటింగ్‌లో ఎక్క‌డా ల్యాగ్ లేకుండా చూశాడు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌:

ప్రేమ‌క‌థ అంటే హీరో హీరోయిన్‌ని చూసి ప్రేమించ‌డం.. ఆమె ప్రేమ కోసం స్నేహితుల స‌హ‌కారం తీసుకుని దెబ్బ తిన‌డం.. ఏదో ఓ మంచి ప‌నిచేసి హీరోయిన్ ప్రేమ పొంద‌డం.. అనుకోకుండా హీరోయిన్‌కి స‌మ‌స్య రావ‌డం.. ఆ స‌మ‌స్య‌ను హీరో ఎలా తీర్చాడ‌నేదే మెయిన్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే.. అంటే రొటీన్ క‌థ‌.. కామెడీ ట్రాక్ ఓ అనే రేంజ్‌లో లేదు. ఓకే.. ఫ‌స్టాఫ్ సన్నివేశాలు ఇత‌ర సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి.

విశ్లేష‌ణ‌:

రాజ్‌త‌రుణ్ ఎప్ప‌టిలా త‌న ఎనర్జీతో.. ఈజ్‌తో న‌టించాడు. అలాగే రిద్ద‌కుమార్ పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉంది. ఆమె కూడా త‌న పాత్రలో ఒదిగిపోయింది. ఇక రాజీవ్ క‌న‌కాల చాలా రోజుల త‌ర్వాత మంచి ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. మెయిన్ విల‌న్స్‌గా న‌టించిన స‌చిన్ ఖేడేక‌ర్‌, అజ‌య్‌, సుబ్బ‌రాజ్ అండ్ గ్యాంగ్ వారి వారి పాత్ర‌ల్లో ఓకే అనిపించారు. ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ సెకండాఫ్‌ను కొత్త‌గా పొట్రేట్ చేయ‌డానికి ప్రయ‌త్నించాడు. అలాంటి ఆలోచ‌న‌ను ఫ‌స్టాఫ్‌లో ట్రై చేసుంటే సినిమా ప్రేక్ష‌కుల‌ను ఇంకా ఆక‌ట్టుకునేదేమో.. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

చివ‌ర‌గా.. ల‌వ‌ర్ ... ఓకే అనిపిస్తాడు.. బ‌ల‌మైన పోటీ లేక‌పోవ‌డం.. దిల్‌రాజు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ ఏమైనా వ‌ర్క‌వుట్ అయితే ల‌వ‌ర్ గ‌ట్టున ప‌డ‌తాడు.

Lover Movie Review in English

Rating : 2.5 / 5.0