ప్రియురాలి కోసం సముద్రాన్నే దాటాడు.. అక్కడే కథ అడ్డం తిరిగింది
- IndiaGlitz, [Wednesday,December 16 2020]
ప్రియురాలి కోసం ఏకంగా సముద్రాన్నే దాటాడు.. చివరిగా ప్రియురాలిని కలుసుకున్నాడు.. అంతా బాగుందని ఎంజాయ్ చేస్తూ ప్రియురాలితో కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లాడు.. డామిట్.. కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ఈ మజ్నూని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నాలుగు వారాల పాటు శిక్ష విధించింది. ఇది స్కాట్లాండ్కు చెందిన డేల్ మెక్‌లాగన్(28) అనే యువకుడి లవ్ స్టోరీ. అసలు విషయంలోకి వెళితే...
జెస్సికా రెడ్ క్లిఫ్ అనే యువతి ఐరీష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్’ దీవిలో ఉన్న రామ్సేలో నివాసం ఉంటోంది. గత సెప్టెంబర్‌లో డేల్ మెక్‌లాగన్.. ఆ దీవిలో పని చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో జెస్సికాను చూసి ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత అక్కడ కాంట్రాక్ట్ వర్క్ పూర్తి కావడంతో తిరి తన సొంతూరుకు వెళ్లిపోయాడు. దీంతో ప్రేయసికి దూరమయ్యాడు. కానీ తన ప్రియురాలిని చూడకుండా మెక్‌లాగన్ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. వెంటనే తనను రామ్సేకు వెళ్లేందుకు అనుమతివ్వాలని అధికారులను వేడుకున్నాడు. కానీ అతని విజ్ఞప్తులను అధికారులు తిరస్కరించారు. దీంతో ఎలాగైనా తన ప్రియురాలిని కలవాలని డిసైడ్ అయిపోయి ఓ జెట్ స్కై(బోటు) కొనుక్కుని ఐరీష్ సముద్రంలో రామ్సేకి బయల్దేరాడు. 25మైళ్ల ప్రయాణాన్ని 40 నిమిషాల్లో చేరుకోవచ్చని తొలుత బావించినప్పటికీ ఎప్పుడూ బోటు నడిపిన అలవాటు లేకపోవడంతో అతని ప్రయాణం నాలుగు గంటలకు పైనే సాగింది.
సముద్రం దాటిన తర్వాత మరో 15 మైళ్లు నడిచి ఎట్టకేలకు ప్రేయసి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా ఓ నైట్ క్లబ్‌కు వెళ్లారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మెక్‌లాగన్ జంట పోలీసుల కంట పడటంతో ఆరా తీశారు. అసలు విషయం బయటపడింది. అంతే కాళ్లా.. వేళ్లా పడినా పోలీసులు వినలేదు. తీసుకెళ్లి కోర్టు బోనులో నిలబెట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి.. కోవిడ్ నిబంధనలను సైతం విస్మరించి.. మొత్తం నగరాన్ని రిస్క్‌లో పెట్టేలా అతని చర్యలు ఉన్నాయంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. నాలుగు వారాలపాటు శిక్ష విధించింది. విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే.. ఈ మెక్లాగన్కు అండగా నెటిజన్లు నిలిచారు. అతని సాహస యాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.