నేలకొరిగిన మేరునగ దర్శకధీరుడు దాసరి....
Send us your feedback to audioarticles@vaarta.com
డా.దాసరి నారాయణరావు..ఓ గురువు....దిశానిర్ధేశకుడు...మారుతున్న ధోరణుల్లో తప్పొప్పులను నిర్భయంగా చెప్పే మార్గదర్శకుడు..అమ్మలా అన్నం పెట్టి, నాన్నలా సమస్యకు ముందు నిలబడిన పెద్దమనిషి ఇప్పుడు లేడు. ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకుని అంబరాన్ని చేరారు. సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 ఏళ్ళు దర్శకుడిగా తెలుగు సినిమాపై తనదైన సంతకం చేశారు. ఇప్పుడున్న సీనియర్ దర్శకులకేందరికో గురువు. ఇప్పటి దర్శకులకు గుగ్గురువు. సామాన్య రైతు కుటంబంలో పుట్టి, పార్లమెంట్ మెంబర్ స్థాయికి ఎదిగిన అసామాన్యుడు. నాటకరంగం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన దాసరి తాత మనవడితో దర్శకుడిగా మారారు. కథనే నమ్ముకుని సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనెంటో ప్రూవ్ చేయడమే కాకుండా ఏ సినిమాకైనా కెప్టెన్ దర్శకుడే అని చాటి చెప్పిన ఘనత దాసరికే సొంతం అందుకే ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 151 సినిమాలను డైరెక్ట్ చేసి ప్రపంచంలో ఏ దర్శకుడు సాధించలేని క్రెడిట్‌ను సొంతం చేసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును క్రియేట్ చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరి హీరోలతో తిరుగులేని సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. సినిమా స్పాట్లోనే అద్భుతమైన సన్నివేశాలను సృష్టించి భారీ విజయాలను కట్టబెట్టిన సృష్టికర్త. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించడం విశేషం.
దర్శకుడిగా 151 చిత్రాలను తెరకెక్కించిన దాసరి నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. 250 చిత్రాలకు పైగా పాటలు, మాటలు అందించారు. మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, మేస్త్రి, ఎర్రబస్సు వంటి చిత్రాల్లో దాసరి తన నటనా కౌశలాన్ని ప్రధర్శించారు. రెండు నేషనల్ అవార్డ్స్, తొమ్మిది నంది అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు దాసరి.
సినీరంగానికి చేసిన ఉత్తమ సేవలకుగానూ 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయన్ను కళాప్రపూర్ణతో సత్కరించింది. 2001లో జీవిత సాఫల్య అవార్డును అందుకున్నారు.13 మంది హీరోయిన్స్, 15మందికి పైగా హీరోలు సహా ఎంతో మంది కొత్త నటీనటులను, టెక్నిషియన్స్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎనలేని సేవ చేసిన దాసరి వంటి దర్శకుడు మరొక లేడు..రాలేడు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments