ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇలా చెయ్యండి
- IndiaGlitz, [Saturday,May 22 2021]
ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అప్లై చేసెయ్యండి. మూడేళ్లుగా నిలిచిపోయిన పబ్లిక్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ట్విటర్ తాజాగా ప్రారంభించింది. వెరిఫికేషన్ ఖాతాల కోసం అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లు ట్విటర్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల్లో ట్విటర్‌కు ప్రత్యేక స్థానమున్న విషయం తెలిసిందే. అందుకే రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ దీనిని వినియోగిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ప్రస్తుత తరుణంలో ట్విటర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అధికారిక ప్రకటనలు సైతం ట్విటర్ నుంచే వెలువడుతున్నా యి.
సామాన్యులు సైతం విపరీతంగా ట్విటర్‌ను వాడుతున్నారు. కానీ ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులకే ట్విటర్ అధికారికి ఖాతా ఉంటుంది. సామాన్యులకు మాత్రం ఇది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. 2017 నవంబర్లోనే పబ్లిక్ వెరిఫికేషన్‌ను ట్విటర్ నిలిపివేసింది. అనంతరం వీలైనంత త్వరలో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని సంస్థ ట్వీట్ చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు. తిరిగి ఇన్నాళ్లకు ట్విటర్ వెరిఫికేషన్ ఖాతాల కోసం అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. వివిధ కేటగిరీలకు చెందిన వ్యక్తులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఎలా?
ట్విట్టర్ ఖాతా వెరిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ కొరకు 1. ప్రభుత్వ 2. కంపెనీలు, బ్రాండ్లు, ఆర్గనైజేషన్లు 3. న్యూస్ ఆర్గనైజేషన్లు, జర్నలిస్టులు 4. ఎంటర్టైన్మెంట్ 5. స్పోర్ట్స్, గేమింగ్ 6. యాక్టివిస్ట్‌లు, ఆర్గనైజర్లు, పబ్లిక్‌లో పేరున్న ఇతర వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్విటర్ యాప్ ద్వారా కానీ, లేదంటే గూగుల్ బ్రజర్ నుంచి కానీ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి.. ట్విట్టర్ అడిగిన వివరాలు ఇవ్వాలి. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం వెరిఫైడ్ అనే ఆప్షన్ కింద ‘రెక్వెస్ట్ వెరిఫికేషన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ట్విట్టర్ అడిగిన వివరాలు జతచేసి రెక్వెస్ట్ పంపితే, ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ఈమెయిల్ ఖాతాకు ధ్రువీకరణ ఈమెయిల్ వస్తుంది. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. మీరు పంపిన వివరాల్ని తనిఖీ చేసి వెరిఫైడ్ ఖాతాను ట్విట్టర్ విడుదల చేస్తుంది.