ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555 కోట్లు చెల్లించండి, దుబాయ్ రాజుకు కోర్ట్ ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదైనా కారణం చేత భర్త.. భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఆమె జీవితం సాఫీగా సాగేందుకు భరణం కూడా చెల్లించాలి. కాల, మాన పరిస్ధితులతో ఇటీవల విడాకులు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విడాకులు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు తమ భార్యలకు విడాకులిచ్చారు. ఇందుకు గాను వీరికి వేల కోట్ల రూపాయలు భరణం కింద చెల్లించారు. ఈ సంపదతో వారు ప్రపంచంలోనే మహిళా సంపన్నులుగా నిలిచారు. తాజాగా దుబాయ్ రాజవంశంలో విడాకుల వ్యవహారం వార్తల్లో నిలిచింది.
దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ (72), ఆయన 6వ భార్య హయా బింట్ అల్ హుస్సేన్ (47) విడాకుల సెటిల్ మెంట్ విషయంలో బ్రిటన్ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హయాకు భరణం కింద రూ. 5,525 కోట్లను చెల్లించాలని దుబాయ్ రాజును ఆదేశించింది. ఇందులో రూ. 2,521 కోట్లను ఏకమొత్తంలో చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
అంతేకాదు రషీద్, హయా సంతానం అల్ జలిలియా (14), జయాద్ (9) లకు చదువు నిమిత్తం రూ. 96 కోట్లు, వారి బాధ్యతల కోసం ప్రతి ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇతర అవసరాల కోసం రూ. 2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాలని తెలిపింది. తద్వారా బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదొకటని మీడియా కథనాలను ప్రచురిస్తోంది. హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు భర్త నుంచి తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఇప్పుడు సంచలన తీర్పును వెలువరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments