Loksatta JP:ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా జేపీ మద్దతు.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్డీఏ(టీడీపీ-బీజేపీ-జనసేన) కూటమికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jaya Prakash Narayana) తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని వాపోయారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని.. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని సూచించారు. అభివృద్ధి చేయకుండా సంక్షేమమే చేసుకుంటూ పోతే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు.
సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని.. అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించి అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న వారు నియంతలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారికి మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయిందని.. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజా పాలన ఇది కాదు అని తెలిపారు.
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినందుకు ఇక నుంచి తనపై కుల ముద్ర వేస్తారని.. దారుణంగా విమర్శలు కూడా చేస్తారని తెలిపారు. అయినా కానీ అభివృద్ధి చేసే కూటమికే తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.. కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అనే సందేహం కూడా ఉందన్నారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి మన పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతివ్వాలని కోరారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటు వేయాలని.. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించి ఓటు వేయాలని జేపీ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments