Lokesh:కలలో కూడా ఊహించలేదు.. చంద్రబాబు అరెస్టుపై లోకేష్ కంటతడి..
- IndiaGlitz, [Saturday,October 21 2023]
తొలిసారిగా అధ్యక్షుడు చంద్రబాబు లేకుండా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గత 45 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబును 43 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉంచారని వాపోయారు. ఇది కలలో కూడా ఊహించలేనిదని, తలుచుకుంటేనే దుఖం తన్నుకొస్తోందని లోకేశ్ కంటతడి పెట్టారు. ఈ కేసులో ఉన్న ఇతర నిందితులకు నెల రోజులకే బెయిల్ వస్తే.. చంద్రబాబుకు మాత్రం ఇంతవరకు రాలేదన్నారు. వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తూ ప్రజానాయకుడిని ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇందిరాగాంధీకే భయపడలేదు.. జగన్‌కు భయపడతామా..?
టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదని చంద్రబాబుని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు భయపడతారని జగన్ అనుకుంటున్నారని తెలిపారు. భయం టీడీపీ బయోడేటాలోనే లేదు.. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగన్‌కు భయపడతామా..? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశాక తన తల్లి తొలిసారిగా బయటకు వచ్చారని అటువంటి తన తల్లి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు అంటూ మండిపడ్డారు. తన తల్లి, భార్య కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం పెట్టి చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు దారుణంగా మాట్లాడారారని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు, బాబాయ్‌ని లేపేయడం వంటి తమ డీఎన్‌ఏలోనే లేవన్నారు.
టీడీపీ-జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో భయం..
టీడీపీ, జనసేనకు పొత్తు కుదరకూడదని జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కానీ ఇప్పుడు పొత్తు కుదరడంతో భయపడుతున్నారని తెలిపారు. టీడీపీ-జనసేన మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ కృషి చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని.. కానీ మీ ఇళ్లల్లో ఏం జరుగుతుందో నోరు విప్పితే తల ఎత్తుకోలేరు అంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితోనే ముందుకు వెళ్దామని టీడీపీ శ్రేణులకు లోకేష్ దిశానిర్దేశం చేశారు.