Lokesh:లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం.. ప్లాన్‌లో మార్పులు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) తిరిగి ప్రారంభం కానుంది. నవంబర్ 24 నుంచి పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడ అయితే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తారని పేర్కొ్న్నారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సాగాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాదయాత్రలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ను విశాఖలోనే ముగించారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో లోకేశ్ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. దీంతో పాదయాత్ర రెండు వారాలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయాల్సి రావడంతో పాదయాత్రను కుదించారంటున్నారు. ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్రను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసి కోస్తా ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది.
అయితే స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అనూహ్యంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్నికలపై ఫోకస్ చేయనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments