Lokesh:కుర్చీ మడతపెట్టిన లోకేశ్.. సీఎం జగన్‌కు మాస్ వార్నింగ్..
- IndiaGlitz, [Friday,February 16 2024]
ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లుతో కాక రేపుతున్నారు. వైసీపీ నేతలు చొక్కా మడతపెడతాం అంటుంటే.. తెలుగు తమ్ముళ్లు కుర్చీ మడతపెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. 'గుంటూరు కారం' సినిమాతో పాపులర్ అయిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఇప్పుడు రాష్ట్రంలో హల్‌చల్ చేస్తోంది. అసలు ఏంటి ఈ గోల అనుకుంటున్నారా..? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
టీడీపీ-జనసైనికుల జోలికి వస్తే చూస్తూ ఉరుకోమని వైసీపీ నేతలకు టీడీపీ యువనేత నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. విజయనగరం నెల్లిమర్లలో శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము జగన్ కుర్చీ మడత పెట్టి, సీటు లేకుండా చేస్తాం అంటూ కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి సాగనంపేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు.
ప్రజలే మా స్టార్ కాంపెయిన్లు అంటున్న జగన్‌కు దమ్ముంటే మద్యం షాపుల వద్ద చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. పోనీ మహిళల వద్ద చర్చ పెడదామా? చెత్త పన్ను, కరెంట్ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా..? జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్.. అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అని ధ్వజమెత్తారు.
'రాజధాని ఫైల్స్ సినిమా, రైతులంటే జగన్‌కు భయమేస్తోందని.. అందుకే ఆ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులంటూ ఊదరగొట్టి.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా..?. మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మత్సకారులకు జెట్టీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఈ పెద్ద మనిషి ఇంతవరకు అక్కడ కొంచెం మట్టికూడా వేయలేదని లోకేశ్ విమర్శించారు.
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్లు చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది అని ఈ జగన్ అంటున్నారు. నువ్వు, మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతపెడతారు. అందరూ కుర్చీలు మడతపెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది అంటూ' మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలో కుర్చీ మడతపెట్టే పదం పాపులర్ అయింది.
కాగా గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన వాలంటీర్లకు అభినందన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు ప్రతి వాలంటీర్, వైసీపీ నేత చొక్కా మడతపెట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. దీంతో జగన్ మాటలకు టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మీరు చొక్కా మడతపెడితే.. మేము కుర్చీ మడతపెడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు.