రూ. 25 లక్షల చిరుతిండిపై లోకేష్ రియాక్షన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రి హోదాలో గట్టిగా మేసేశారని... కేవలం చిరు తిండికే లక్షల్లో ఖర్చు చేశారంటూ గత కొన్నిరోజులుగా ఈ వ్యవహారం హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు కాదు ఏకంగా రూ. 25 లక్షల చిరుతిండే తినేశారంటూ లెక్కలు, డాక్యుమెంట్లతో సహా వివరాలు బయటికొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు షాకవ్వగా.. తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారట. మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, వైసీపీ వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు వర్షం కురిపిసించారు.
అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు నారా లోకేష్ స్పందిస్తూ కాసింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వైఎస్ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసత్య కథనం వండి వార్చింది..!
‘అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి. @ysjagan గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, సాక్షి మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది. తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను’ అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో..!
‘ఐదేళ్ల ఏపీసర్కారు ప్రోటోకాల్ ఖర్చు నాకు జమ వెయ్యమని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా? చిల్లరకథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్ళు. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసింది. ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు’ అని లోకేష్ రాసుకొచ్చారు.
నా అకౌంట్లో వేశారు!
‘అక్టోబర్ 30, 2018న నేను ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆ రోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170లు బిల్లును కూడా నా అకౌంట్లో వేశారు. విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షిలాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యం’ అని చినబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout