ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దుల్లో మిడతల దండు..
- IndiaGlitz, [Saturday,June 27 2020]
ఓ పక్క కరోనా దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తోంది. ఒకేసారి వచ్చిన రెండు విపత్తులతో ప్రజానీకం భయాందోళనలు చెందుతోంది. తాజాగా డిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో మిడతల దండు కనిపించి స్థానికులను భయపెట్టింది. వ్యవసాయ శాఖలోని మిడతల హెచ్చరికల విభాగం అధికారి కేఎల్ గుర్జార్ కథనం మేరకు.. నేటి ఉదయం 11:30 సమయంలో పెద్ద ఎత్తున మిడతల దండు గురుగ్రామ్‌లోకి ప్రవేశించాయి.
ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇవి దట్టంగా వ్యాపించాయి. కారుమేఘంలా ఆవరించిన మిడతల దండును చూసి భయపడిపోయిన ప్రజానీకం ప్లేట్లు.. గరిటెలతో శబ్దాలు చేస్తూ వాటిని తోలేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. మిడతల దండు అక్కడి నుంచి హర్యానాలోని పల్వాల్ వైపునకు వెళ్లాయని కేఎల్ గుర్జార్ తెలిపారు.