మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక
- IndiaGlitz, [Wednesday,April 15 2020]
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మే-03 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. అంటే ప్రజా రవాణా మొత్తం రద్దే అన్న మాట. అయితే.. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో నిశితంగా పేర్కొంది.
మార్గదర్శకాలు ఇవీ..
- ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి
- వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
- అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ
- సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేత
- విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత
- మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
- పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
- ఉపాధి హామీ పనులకు అనుమతి,
- అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
- రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కట్ల కార్యకలాపాలకు అనుమతి
- వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
- వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
- విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
- బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం
- అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి
- రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు అనుమతి
- ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ
- గోదాములు, శీతల గోదాములకు అనుమతి
- ఈ కామర్స్ సంస్థలు, వాహనాలకు అనుమతి
- వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి
- ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతి
- గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు
- బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి
- భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథం
- ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి
- హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. హాట్‌స్పాట్ జోన్లను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి. ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో నిశితం చెప్పింది. ఒకవేళ పైన మార్గదర్శకాలను ఎవరైనా లెక్కచేయకుండా ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా కేంద్రం హుచ్చరించింది.