మరో 2వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రధాని అంగీకారం!?
- IndiaGlitz, [Saturday,April 11 2020]
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్-14తో లాక్‌డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవాళ ప్రధాని మోదీ వీడియో లింక్ ద్వారా సీఎంలతో నిర్వహించిన సమావేశంలో దాదాపు ఈ నిర్ణయం తీసేసుకున్నారని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రతరం అవుతున్న తీరు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని, సీఎంల మధ్య సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మెజారిటీ సీఎంలు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు. మొత్తానికి చూస్తే.. నెలాఖరు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది
‘జీవితంతో పాటు ఆర్థిక స్థిరత్వం’ !
ఈ సందర్భంగా ఇండియాలో మూతబడ్డ పరిశ్రమలు, దేశం ముందు నిలిచిన సవాళ్లు, ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా కీలకంగా చర్చ జరిగింది. ఆ సమయంలోనే మోదీ తన మనసులోని మాటను బయట పెట్టారు. మొన్న అనగా.. ‘జీవించి ఉంటే సంపాదించగలం’ అని పిలుపునిచ్చినట్టు ఆయన మరోసారి గుర్తు చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లాక్‌డౌన్ తప్పనిసరని అని తాను అన్నానని.. ఇప్పుడు మాత్రం ‘జీవితంతో పాటు ఆర్థిక స్థిరత్వం’ అనే పిలుపునిచ్చారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలంతా ఒకేతాటిపై నడవాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రసంగం లేనట్టే..
వాస్తవానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మోదీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేస్తారని దేశ ప్రజలు భావించారు. అయితే ఆయన ప్రసంగం మాత్రం చేయలేదు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుండగా, ఆపై మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎంలతో ప్రధాని చెప్పేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇదే విషయాన్ని మోదీ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.