లాక్‌డౌన్ 5.0 : జూన్ 14 వరకు పెంపు యోచన!
- IndiaGlitz, [Friday,May 29 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఇండియాలో ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. లాక్ డౌన్ 4.0 ఎల్లుండితో పూర్తికానుంది. ఇలాంటి తరుణంలో ఎలా ముందుకెళ్లాలి..? పొడిగించాలా..? వద్దా..? పొడిగిస్తే పరిస్థితేంటి..? అనేదానిపై ప్రస్తుతం కేంద్ర పెద్దలు చర్చిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పొడిగింపు, చైనా ఉద్రిక్త పరిస్థితులపై నిశితంగా చర్చించారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో నిశితంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నిరోజులు..!
మరో రెండు వారాలు అనగా.. జూన్- 14 వరకు పొడిగిస్తారనే వార్తలు గురువారం నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం నాడు ప్రధాని నిర్వహించనున్న ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఎక్కువ కావడం వల్ల దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నిపుణులు ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ఐదో విడత లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే కనుక నియమనిబంధనల విషయంలో అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రకటన ఏమొస్తుందో..!?
మరీ ముఖ్యంగా పండుగలు, జాతరలు, సామూహిక ప్రార్థనలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమి కూడే కార్యక్రమాలను మాత్రం అనుమతించకూడదని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టెర్మ్‌లో కూడా సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, బార్లు, పబ్బులతోపాటు విద్యాసంస్థలపై ఇప్పుడున్న నిషేధం అలానే కొనసాగనుందని సమాచారం. అంతేకాదు.. మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే దాని ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై కూడా భేటీలో చర్చించారని తెలుస్తోంది. మరి ఫైనల్‌గా పరిస్థితులు ఎలా ఉంటాయో.. మోదీ నోట ఎలాంటి ప్రకటన వస్తుందో అని యావత్ భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.