RBI : షాకిచ్చిన ఆర్‌బీఐ.. మరోసారి రెపో రేటు పెంపు, ఈఎంఐలు ఇక భారమే..!!
- IndiaGlitz, [Wednesday,June 08 2022]
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. దేశంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు గాను రేపో రేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. సోమవారం నుంచి జరుగుతున్న పరపతి విధాన కమిటీ సమావేశ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రెపో రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో మొత్తంగా రెపో రేటు 4.90 శాతానికి చేరుకుంది.
అన్ని దేశాల్లోనే ఇదే పరిస్థితి:
అయితే ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రెపో రేటు పెంపు వుంటుందని కేంద్ర బ్యాంక్ గతంలోననే సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరుకుంది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి. ఇది పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో 45 దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా కూడా మంగళవారం వడ్డీరేట్లను 2 శాతం పెంచింది.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వృద్ధిపై ఆర్‌బీఐ ఫోకస్:
ఇకపోతే.. గ్రామీణ సహకార బ్యాంకులు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు రుణాలిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. పట్టణ సహకార బ్యాంకులు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు రుణాలిచ్చేందుకు ఆర్‌బీఐ అనుమతింది. దీనితో పాటు క్రెడిట్ కార్డులనను యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
పెరగనున్న ఈఎంఐల భారం:
ఆర్బీఐ రెపో రేటును పెంచడం వల్ల బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. వాయిదాలలో మార్పులు లేనప్పటికీ.. కట్టాల్సిన ఈఎంఐల సంఖ్య పెరిగే అవకాశం వుంది. మరోవైపు ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచినట్లుగా కథనాలు వస్తున్నాయి.