వరుణ్ తేజ్ వాళ్ళ బాబాయ్ కంటే పెద్ద హీరో అవుతాడు - ప్రభాస్
- IndiaGlitz, [Tuesday,December 08 2015]
'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'.
ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. తొలి సీడీని యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఆవిష్కరించి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి అందించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఆడియో ఆవిష్కరణలో మెగా బ్రదర్ నాగబాబు, దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, బి.గోపాల్, నిర్మాతలు డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, జెమిని కిరణ్, ఆర్.కె.గౌడ్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, సీనియర్ నటి రేవతి, ఏషియన్ ఫిలింస్ నారాయణరాజు, సునీల్ నారంగ్, అశోక్ కుమార్, నిర్మాత సి.కళ్యాణ్ సోదరుడు వెంకటేశ్వరరావు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, లిరిసిస్టులు సుద్ధాల అశోక్ తేజ, కందికొండ, భాస్కరభట్ల, అలీ, హీరో ఆకాశ్ పూరి, సురేష్ కొండేటి, బెక్కం వేణుగోపాల్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఛాముండి, రఘురామరాజు, డా.వై.లయన్ కిరణ్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ - ''వరుణ్‌తేజ్ కూడా తన బాబాయ్ పవన్‌కల్యాణ్‌లా పెద్ద హీరో అవుతాడు. అభిమానుల సపోర్ట్ ఉంటే చాలు. పూరీ గారు అంటే నాకు చాలా ఇష్టం. మేం క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా బైటికి వెళితే కలిసే వెళ్తాం. ఓసారి 3 ఇడియట్స్ సినిమాకి వెళ్తుంటే.. ట్రాఫిక్‌లో మా కార్ దగ్గరికి వచ్చి బెగ్గర్స్..చెయ్యి చాచాడు. కార్ అద్దాలు తొలగించి పూరీ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దటీజ్ పూరీ. అతడి మంచి మనసు గురించి చెప్పడానికి ఇది చాలు. స్టార్లను సూపర్‌స్టార్లను చేసేది పూరీనే. బుజ్జిగాడు కోసం ఆరు నెలలపాటు వేచి చూశాను తను బిజీగా ఉంటే. ఇండియాలో ఒకే ఒక్క రైటర్.. హీరోని ఛాయిస్‌గా తీసుకుని రాసే రైటర్ పూరి జగన్నాథ్ మాత్రమే. ఎస్.ఎస్.రాజమౌళి అంతటివారే ఓ మాటన్నారు. నేను సీన్ తీయాలంటే 100రోజులు పడుతుంది. అది పూరీ ఒక్క డైలాగ్‌లో ఫినిష్ చేస్తాడని అన్నారు.. పూరి, వరుణ్‌తేజ్ ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలి'' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ -''నేను కొన్నేళ్ల క్రితం ..ఒక సినిమా తీశాను. ఆ సినిమా పేరు అమ్మా నాన్న తమిళమ్మాయ్. ఆ టైమ్‌లో వర్మగారు ముంబై నుంచి వచ్చారు. ఏ సినిమా చేస్తున్నావ్? అని అడిగారు. టైటిల్ విని .. పెదనాన్న, మావయ్య గురించి ఎలా కథలు రాస్తారు.. అంటూ తిట్టారు. అదే వర్మ ఇప్పుడు లోఫర్ చూసి ఆ టైటిల్ తీసేసి మా అమ్మ మహాలక్ష్మి అని టైటిల్ పెట్టమన్నారు. అక్కడే నేను సక్సెసయ్యాను అనిపించింది. చాలా ఏళ్ల తర్వాత మదర్ సెంటిమెంటుపై సినిమా తీశాను. వరుణ్ తేజ్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. నా ముందే పెరిగాడు. అప్పట్లో వరుణ్ చాలా లావుగా ఉండేవాడు. నాగబాబుని హీరో అవుతాడా ఇలా ఉంటే అని అడిగాను. ఏమో ఏమవుతాడో.. అన్నారాయన. ఎనిమిదేళ్ల క్రితం వరుణ్ నా దగ్గరికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తానన్నాడు. హీరో అవ్వను, దర్శకత్వం ఇష్టం అన్నాడు. కానీ ఎందుకనో చేరలేదు. కానీ ఫైనల్‌గా నాకు డైరెక్షన్ ఛాన్సిచ్చాడు. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్‌పై సాంగ్‌లో ఫెంటాస్టిక్‌గా నటించాడు. ఆ ఒక్కటీ చాలు. వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడు.. అని చెప్పడానికి. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు వరుణ్‌కి ఉన్నాయి. వరుణ్ అంటే చిరుకి ఎంతో ఇష్టం. ఇప్పటికే 60 సినిమాలు తీసిన నిర్మాత సి.కళ్యాణ్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. దిశాపటానీని రెండేళ్ల క్రితమే చూశాను. ఇలియానా -2 అంటున్నారంతా. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. ప్రభాస్ గురించి మాట్లాడాల్సి వస్తే .. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ ఓ టిప్పర్ లారీ వచ్చి స్కూటర్‌ని గుద్దేస్తే ఎలా ఉంటది? అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. బాహుబలితో టిప్పర్‌లారీలా కొట్టాడు మమ్మల్ని. బాహుబలితో దేశాన్ని కొట్టాడు. ప్రభాస్‌ని హగ్ చేసుకుంటే చాలా బావుంటది. తను అంత పాజిటివ్‌గా ఉండే హీరో. లోఫర్ మూవీకి సునీల్ సంగీతం అందించాడు. బాణీలు ఆకట్టుకుంటాయి'' అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ -''మా ఆడియో ముఖ్య అతిధి ప్రభాస్ నటించిన ఈశ్వర్‌లో లాఠీ పట్టుకున్న విలన్‌గా కనిపించా. తన జర్నీ అలా మొదలైంది. బాహుబలితో ప్రపంచంలోనే తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చాడు. పూరీ నాకు ఓ సూపర్‌సక్సెస్‌ని ఇవ్వబోతున్నాడు. అంత నమ్మకంగా ఉన్నాం. ఇక వరుణ్ తేజ్ తొలి సినిమా ముకుంద మొదలవ్వకముందే నాగబాబుతో పెద్ద హీరో అవుతాడని చెప్పాను. డిసెంబర్ 17న ఆ సంగతి ప్రూవ్ అవుతుంది. మెగాస్టార్ ఫ్యామిలీలో మెగాస్టార్ వరుణ్‌తేజ్ అని మీరంతా కేకలేస్తారు. అంత గొప్పగా నటించాడు'' అన్నారు.
రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -''జగన్ .. ఓ పోకిరిలా ఇడియట్‌లా రోడ్ల మీద తిరిగేస్తూ క్యారెక్టర్లు రాసేస్తుంటాడు. అలా సక్సెస్ కొట్టేస్తున్నాడు. ఈ సినిమాతో మరో పెద్ద హిట్టు కొడతాడు'' అన్నారు.
హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ -''ఛత్రపతి కంటే ముందే ఈశ్వర్ సినిమా నుంచే నేను ప్రభాస్‌కి ఫ్యాన్‌ని. ఆడియో రిలీజ్‌కి విచ్చేసినందుకు థాంక్స్. పూరి జగన్నాథ్ గారిని ఇంటర్ రెండో సంవత్సరం(చిరుత రిలీజ్ టైమ్) లో ఉన్నప్పుడు కలిశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్సివ్వమన్నాను. కానీ నేనే వెళ్లలేదు. మొత్తానికి తన దర్శకత్వంలో హీరోగా ఛాన్సొచ్చింది. షూటింగ్ చాలా ఫన్నీగా సాగింది. ఇదో చక్కని అనుభవం. నిర్మాతలు సి.కల్యాణ్, సి.వి.రావ్ గారికి థాంక్స్. రేవతి మదర్ పాత్రలో చేశారు. పిజి విందా జోద్ పూర్ లొకేషన్స్‌ని అందంగా కాప్చుర్ చేశారు. పూరీ డైరెక్షన్ టీమ్, ఇతర టెక్నీషియన్లు చక్కగా. స్పీడ్‌గా పనిచేశారు. దిశాపటానీ డ్యాన్సులు ఇరగదీసింది. సునీల్ మ్యూజిక్ బ్రిలియంట్. మా ఫ్యామిలీ హీరోలతో చిన్న సైజ్ క్రికెట్ టీమ్‌లా తయారైంది. ప్రతి నెలా సినిమా ఉంటుంది ఇలా ఉండడం వల్ల..లోఫర్ మూవీతో చక్కని విజయం అందుకుంటాను'' అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి యాంకర్ విజువల్స్ (ఏవీ)లో మాట్లాడుతూ -''వరుణ్‌తేజ్ మూడో సినిమాకే పూరీతో పనిచేయడం అదృష్టం. లోఫర్ ట్రైలర్స్ చూశాను. స్టన్నింగ్‌గా ఉన్నాయి. పూరీ మార్క్ ఉంది పాటలు, ట్రైలర్‌లో. పవన్‌కి బద్రి, చరణ్‌కి చిరుత, బన్నికి దేశముదురులా .. వరుణ్‌కి లోఫర్ పెద్ద సక్సెసవ్వాలి. వరుణ్ నటించిన మూడు చిత్రాల్లో మూడు రకాల డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. సునీల్ కశ్యప్ సంగీతం, ఆర్.ఆర్ చాలా బావున్నాయి. కళ్యాణ్, పూరీ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఏవీలో మాట్లాడుతూ -''సి.కళ్యాణ్ నా కళ్లముందే ఎదిగాడు. పూరీతో లోఫర్ తీయగలిగేంత స్థాయికి ఎదగడం ఆనందాన్నిచ్చింది. పూరీ నాకు ఇష్టమైన దర్శకుడు. నిర్మాతల దర్శకుడాయన. చెప్పిన టైమ్‌కే సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. కథే హీరో అని నమ్మి ఎవరితోనైనా సినిమా తీయగల సమర్థుడు. ఇడియట్‌తో ఓ కొత్త కల్ట్‌ని అలవాటు చేశాడు. వరుణ్ మొదటి సినిమా ముకుంద చూసి గొప్ప నటుడవుతాడని నాగబాబుకి చెప్పాను. కంచెలో తను రాటు దేలి నటించాడు. లోఫర్ దర్శకుడి సినిమాగా భావిస్తున్నా. పెద్ద విజయం సాధించి నిర్మాతకు డబ్బులు రావాలి'' అన్నారు.
అగ్రనిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -''పూరీకి హీరోని ఎలా చూపించాలో బాగా తెలుసు. ప్రభాస్ డార్లింగుకి వర్షం ఎలానో వరుణ్‌కి ఈ సినిమా అలాంటి విజయాన్ని ఇవ్వాలి'' అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ- ''ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. సువ్వి సువ్వాలమ్మ .. ఎట్టా చెప్పేదమ్మా .. ఈ పాట వెరీ స్పెషల్. సుద్ధాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కందికొండ లిరిక్స్ వల్ల పాటలకు అందం వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అన్నారు.