అందరికీ తెలిసిన శ్రీదేవి గురించి కొందరికే తెలిసిన కొన్ని విషయాలు

  • IndiaGlitz, [Monday,February 26 2018]

అడుగుపెట్టింది బాల నటిగానైనా హీరోయిన్ గా అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగి -ఆందంలోనూ, అభినయంలోనూ, అంతఃకరణ లోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి ఫిబ్రవరి 24న హఠాత్తుగా మరణించడం పట్ల ప్రజలు, ప్రేక్షకులు, యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి కి లోనవడమే కాక ఆమెను గురించి తమకు తెలిసిన విషయాలను, విశేషాలను పంచుకున్నారు. అలా ఎంతోమందికి తెలియని, మరుగున పడిపోయిన మరి కొన్నిటిని ఇక్కడ ...

శ్రీదేవి తల్లి రాజేశ్వరి నటిగా గుర్తింపుని తెచ్చుకుందామని పరిశ్రమకు వచ్చింది. సావిత్రి హీరోయిన్ గా నటించిన 'చివరకు మిగిలేది' (1960) లో 'అందానికి అందం నేనే' అనే పాటకు నర్తకి జ్యోతి తో పాటు నృత్యం చేస్తూ కనిపిస్తుందామె.

ఏయన్నార్, రాజసులోచన నటించిన 'శాంతినివాసం' (1960) లో కృష్ణకుమారి కి సోదరి పాత్రకి వెతుకుతుంటే 'చివరకు మిగిలేది' లో ఆమెను చూసిన నటుడు కాంతారావు 'రాజేశ్వరి అనే ఓ కొత్తమ్మాయి వచ్చింది. ఆమె పనికొస్తుందేమో చూడండి' అని సజెస్ట్ చేశారు. అలా ఆమెకి ఆ పాత్ర లభించింది. ఆ సినిమాలో కృష్ణకుమారి అభినయించిన హిట్ సాంగ్ 'కలనైనా నీ వలపే' లో కనిపించింది రాజేశ్వరి. ఒక విధంగా ఆ సినిమాలో ఆమెది పెద్ద పాత్రే.

ఆ తరువాత ఏయన్నార్, కృష్ణకుమారి నటించిన 'భార్యాభర్తలు' (1961) లో ఓ చిన్న రోల్ వేసింది. ఆ సినిమా ప్రారంభంలో అక్కినేనిది ఎంతో మంది అమ్మాయిలతో తిరిగే పాత్ర. అందులో అక్కినేని అభినయించిన పాప్యులర్ గీతం 'జోరుగా హుషారుగా షికారు పోదమా' లో ఆయన వెంటపడే ఒక అమ్మాయిగా కనిపించింది రాజేశ్వరి. అటు అక్కినేని తోను ఇటు ఆయన కుమారుడు నాగార్జున తోనూ నటించిన క్రెడిట్ శ్రీదేవికుంటే - ఇటు ఆమె తోనూ అటు ఆమె తల్లి రాజేశ్వరి తోనూ నటించిన క్రెడిట్ ఏయన్నార్ అకౌంట్ లో ఉన్నాయి.

బాలనటిగా తెలుగులో శ్రీదేవి తొలిచిత్రం ' మా నాన్న నిర్దోషి' (1970) లో 'ఎంతెంత దూరం' పాటలో ఆమె చూపిన హావభావాలు సీనియర్ నటీమణులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దాంతో ఆమె లేని చిత్రం అప్పట్లో ఉండేది కాదనే చెప్పాలి.

ఇవిలా వుండగా 1972 లో హిందీలో శక్తిసామంత 'అనురాగ్' అనే సినిమా తీశాడు. నటి మౌసమీ చటర్జీకి అదే తొలి చిత్రం. అందులో ఆమె అంధురాలిగా నటించింది. అదే సినిమాని 1975 లో 'అనురాగాలు' పేరిట తీశారు. అప్పడు దర్శక నిర్మాతలకు శ్రీదేవి మాత్రమే సూటవుతుందనిపించింది . అలా ఆ సినిమా హీరోయిన్ గా శ్రీదేవికి తొలి చిత్రం అయింది. అందరూ అనుకుంటున్నట్టుగా 1978 లో వచ్చిన 'పదహారేళ్ళ వయసు' హీరోయిన్ గా శ్రీదేవికి తొలిచిత్రం కాదు.

ఇక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమెను గురించిన విషయాలన్నీ అందరికీ తెలుసు. కానీ కొదరికే తెలిసిన తమాషా సంఘటన ఒకటుంది. అదేటంటే - 'క్షణక్షణం' సినిమాలో 'కింగులా కనిపిస్తున్నాడు' అనే పాటను శ్రీదేవి స్వయంగా తానే పాడింది. ఆ పాట రికార్డింగ్ కి తనతో పాటు ఓ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది శ్రీదేవి. తను కొంచెం పాడడం - ఆ అమ్మాయి బాగుందని కళ్ళతో ఓకే అంటే శ్రీదేవి ' బాగా వచ్చిందండీ' అనడం - ఒకవేళ అంత తృప్తిగా రాకపోతే ఆ అమ్మాయి కళ్ళతోనే సైగ చేస్తే 'మరోసారి చూద్దాం అండీ' అని శ్రీదేవి అనడం - అలా ఆ పాటంతటికీ ఆ అమ్మాయి జడ్జిమెంట్ నే ఫాలో అయింది శ్రీదేవి. ఆ అమ్మాయి ఎవరో కాదు ... తర్వాతి రోజుల్లో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన మహేశ్వరి.

ఇవాళ మనం ఎంత తల్చుకున్నా, ఎన్ని చెప్పుకున్నా అవన్నీ తాత్కాలికంగా లభించే ఓదార్పులే - ఎందుకంటే శ్రీదేవి లాంటి నటి ఇంతకు ముందు లేదు. భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు కాబట్టి.

- రాజా (మ్యూజికాలజిస్ట్)

More News

'నందికొండ వాగుల్లోన' ఆడియో విడుదల

బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పై సాయి వెంకట్ ప్రెసెంట్స్ నందికొండ వాగుల్లోన.

మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో కాజ‌ల్‌?

'ఖైదీ నంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి'తో పాటు ఇటీవల విడుదలైన 'అ!' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకున్నారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఆమె నటించిన 'ఎం.ఎల్.ఎ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

'సీటీమార్' అంటున్న ర‌వితేజ‌?

స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రీష్‌ శంకర్.. త్వరలోనే మాస్ మహారాజా రవితేజతో 'సీటీమార్' అనిపించ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. కాస్త వివరాల్లోకి వెళితే.. గత మూడు నాలుగు రోజులుగా హరీష్ శంకర్ ‘సీటీమార్’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారనే సమాచారం మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే.

70 వ‌సంతాల 'బాలరాజు'

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'బాలరాజు' ఒక‌టి. న‌టుడిగా ఆయ‌న‌కు ఏడ‌వ చిత్ర‌మిది. ఎస్.వరలక్ష్మి, అంజలీ దేవి, క‌స్తూరి శివ‌రావు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన ఈ అద్భుత ప్రేమకావ్యాన్ని.. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.

క‌లిసొచ్చిన సీజ‌న్‌లో క‌ళ్యాణ్ రామ్ డ‌బుల్ ధ‌మాకా

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మొద‌టి సినిమా 'తొలిచూపులోనే' (2003) అయిన‌ప్ప‌టికీ.. గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 'అతనొక్కడే'(2005). ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు.