ఈ ఏడాది అదరగొట్టిన ‘‘ ‘డించక్ డించక్’’ సాంగ్స్ ఇవే..!!!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఆడియన్స్‌లోకి బలంగా వెళ్లాలంటే.. ఆడియో అదిరిపోవాలి. సినిమాల విషయంలో స్పెషల్ సాంగ్స్ కుండే క్రేజే వేరు. సినిమా అంతటికీ హైలెట్ అయ్యే ఐటమ్ సాంగ్స్‌ని మనసు పెట్టి మరి తీస్తారు. లేటెస్ట్‌గా సుకుమార్ -బన్నీ ‘‘పుష్ప’’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ ‘‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’’ సౌత్ ఇండియాని ఒక ఓ ఊపు ఊపేస్తోంది.
కమర్షియల్ తెలుగు సినిమాలో మాస్ పాటలకు ప్రత్యేక స్థానముంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ‘‘స్పెషల్ ’’ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో తెలుగు వారికి ప్రత్యేక స్థానముంది. ‘‘మాయదారి చిన్నోడు మనసే లాగేస్తున్నాడు’’, ‘‘గుడివాడ ఎల్లానూ.. గుంటూరు ఎల్లానూ’’, ‘‘నీ ఇల్లు బంగారంగానూ’’, ‘‘పుట్టింటోళ్లు తరిమేశారు’’, ‘‘బావలు సయ్యా’’ వంటి మాస్ గీతాలు.. జనానికి పూనకాలు తెచ్చాయి. తెలుగు నాట జరిగే తిరునాళ్లు, జాతరలు, ఇతర ఈవెంట్స్‌లలో డీజే బాక్స్‌ల్లో ఇవి మోగాల్సిందే.
అప్పట్లో కే. రాఘవేంద్రరావు స్పెషల్ సాంగ్‌లకి స్పెషలిస్ట్‌గా మారితే.. ఇప్పుడు సుకుమార్ ఆ లోటును భర్తీ చేస్తున్నారు. ఆయన కెరీర్ లో చేసిన 8 సినిమాల్లో ఒక్క ‘‘నాన్నకు ప్రేమతో’’లో తప్పించి అన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో ధియేటర్లలో కేకలు పెట్టించారు సుకుమార్. ప్రతి సినిమాలో పాటలకి కావల్సినట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి... ఆ సిచ్యువేషన్స్‌కి యాప్ట్ అయ్యే ‘‘మసాలా’’ సాంగ్స్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాడు సుక్కు. ఆయనే కాకుండా మరికొందరు దర్శకులు కూడా స్పెషల్ సాంగ్స్‌తో ఈ ఏడాది పలకరించారు. అవేంటో ఒకసారి చూస్తే:
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’. ఇందులో అప్సరారాణి నర్తించిన ‘భూమ్ బద్దలు’ సాంగ్ ఈ ఏడాది ప్రారంభంలో యువతను విశేషంగా అలరించింది. తమన్ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ ఆలపించారు.
చాక్లెట్ బాయ్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల నటించిన ‘రెడ్’ సినిమాలో వచ్చే ‘డించక్ డించక్’ పాట జనాన్ని మెప్పించింది. సీనియర్ హీరోయిన్ హెబ్బా పటేల్ తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇచ్చారు. సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రంభ ఊర్వశి మేనక’ పాట యువతను ఆకట్టుకుంది. శ్రీమణి సాహిత్యం అందించగా, మంగ్లీ, హేమచంద్ర ఆలపించారు.
కౌశిక్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘‘చావు కబురు చల్లగా’’ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ నర్తించిన ‘పైన పటారం’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘సా న రె’ సాహిత్యం అందించిన పాటకు జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ, రామ్, సాకేత్ ఆలపించారు.
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’లో ‘మందులోడా’ పాట ఆకట్టుకుంది. మణిశర్మ స్వరాలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇచ్చారు. సాహితీ, ధనుంజయ ఆలపించారు.
సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సిటీమార్’. ఇందులో ‘పెప్సీ ఆంటీ’ అంటూ సాగే పాటకు తనదైన డ్యాన్స్‌తో అప్సరా రాణి మరోసారి అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, విపంచి రాసిన పాటను కీర్తన శర్మ ఆలపించారు.
సందీప్ కిషన్ హీరోగా నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన ‘గల్లీరౌడీ’లో వచ్చే ‘ఛాంగురే ఐటమ్ సాంగురే’ కూడా యువతను అలరించింది. సాయికార్తీక్ సంగీతం అందించగా.. భాస్కర భట్ల రాశారు. మంగ్లీ ఆలపించారు.
ఇక చివరిగా చెప్పుకోవాల్సింది.. ‘‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘‘పుష్ప’’ మూవీలో వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం సౌతిండియాని ఊపేస్తోంది. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్ ఈ పాటను ఆలపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments