దిగిరానున్న మద్యం ధరలు.. మందుబాబులకు త్వరలో తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..?

  • IndiaGlitz, [Monday,March 07 2022]

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. కొవిడ్ 19 వ్యాప్తి సమయంలో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మద్యం రేట్లను 20 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలతో లిక్కర్‌ విక్రయాలు తగ్గినట్లు సర్కార్ గుర్తించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గడానికి పెంచిన ధరలే కారణమని భావిస్తున్న ఎక్సైజ్ శాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

అయితే థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టినా.. అమ్మకాలు తగ్గడంతో అబ్కారీ శాఖ ఆలోచనలో పడింది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ అమ్మకాలు మళ్లీ పెరిగేలా చేసేందుకు ఒక్కో బాటిల్‌పై రూ.10 తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల తగ్గింపుపై ఆ శాఖ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని సమాచారం. అయితే బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యంపై స్వల్పంగా ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2620 వైన్స్ షాపులతో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన కొన్ని రోజుల నుంచి మద్యం డిపోల నుంచి సరుకు తక్కువగా రవాణా అవుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 20 శాతం వరకు మద్యం ధరలు పెంచింది.