'మర్డర్‌' సినిమా విషయంలో ఆర్జీవీకి లైన్‌ క్లియర్‌..

రామ్‌గోపాల్‌ వర్మ చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం.. ఒక వైపు సక్సెస్‌ కావడం. తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరకడం. అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే.. వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ) రూపొందిస్తోన్న చిత్రం ‘మ‌ర్డ‌ర్‌’. మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఆధారంగా వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. త‌న‌కు తెలిసిన, ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన విష‌యాల‌ను ఆధారంగా చేసుకుని ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నానని వర్మ రీసెంట్ ఇంటర్వ్యూల్లో తెలియజేసిన సంగతి తెలిసిందే.

మిర్యాల‌గూడ ప్ర‌ణ‌య్ హ‌త్య కేసు ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌ణ‌య్ భార్య అమృత న‌ల్గొండ డిస్ట్రిక్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుద‌ల‌ను ఆపాల‌ని, ప‌బ్లిసిటీ ఆపాలంటూ అమృత కోర్టులో కేసు వేసింది. కేసు ముగిసే వరకు సినిమా విడుదలపై కోర్టుస్టేను విధించింది. అయితే శుక్రవారం కోర్టు ఆర్జీవీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. స్టేను కొట్టివేస్తూ మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలను ఉపయోగించకుండా సినిమాను విడుదల చేసుకోవాలని మేకర్స్‌కు సూచనలు చేసింది. ఈ విషయంపై వర్మ తన సంతోషాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తను ఎందుకు సినిమా తీస్తున్నాననే విషయాన్ని కోర్టు అర్థం చేసుకుందని వర్మ తెలిపారు.