గవర్నర్ ఆమోదం.. 3 రాజధానులకు లైన్ క్లియర్
- IndiaGlitz, [Friday,July 31 2020]
ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ బిల్లుకు కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మూడు వారాల క్రితం అంటే జూన్ 16న ఈ బిల్లులను గవర్నర్ వద్దకు పంపించింది.
అయితే గవర్నర్ న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. కాగా సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి.