సాధారణంగా ఇంటెలిజెంట్ గేమ్ మూవీస్ అంటే మనకు వెంటనే హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఈ తరహా చిత్రాలు తెలుగులో కూడా ఎక్కువైయ్యాయి. అలాంటి కోవలో రూపొందిన సినిమాయే 'లై'. నితిన్ 'అఆ' వంటి సక్సెస్ తర్వాత చేసిన సినిమా కావడంతో 'లై'పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అదిగాక హనురాఘవపూడి సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయమే ఉంది. తన టేకింగ్ బావుందని అందరూ అంటుంటారు. నితిన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'లై' సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం
కథ:
సత్యం(నితిన్) తన పేరులో ఎ అనే అక్షరాన్ని కలుపుకుని తనని తాను అసత్యం అని చెప్పుకుంటూ వుంటాడు. తండ్రిలేని సత్యంకి తొందరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలన్నది సత్యం తల్లి కోరిక. అయితే సత్యం మాత్రం లైఫ్‌లో మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటూ ఉంటాడు. అందుకోసం లాస్ వేగాస్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఈ ప్రయాణంలో సత్యంకు ఛైత్ర(మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. ఛైత్ర పిసినారి అమ్మాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ పుడుతుంది. కథ ఇలా సాగుతుండగా పద్మనాభం( అర్జున్) ఓ సూట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సూట్ కోసం మరోవైపు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌వారు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు పద్మనాభం ఎవరు? సూట్‌కు, పద్మనాభానికి, సత్యంకు ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలైట్స్:
- నటీనటుల పనితీరు
- స్క్రీన్‌ప్లే
- ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
డ్రాబాక్:
- రొటీన్ రివెంజ్ డ్రామా
- సాంగ్స్ పిక్చరైజేషన్
విశ్లేషణ:
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది నటీనటుల పనితీరు. ఇప్పటి వరకు మాస్, యాక్షన్, లవ్ సినిమాలనే చేస్తూ వచ్చిన నితిన్ రూట్ మార్చి మైండ్ గేమ్ మూవీ చేయడం గమనార్హం. క్యారెక్టర్ పరంగా నితిన్ సినిమాను ఓన్ చేసుకుని చేశాడు. ఇంట్రడక్షన్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు నితిన్ మంచి ఎఫర్ట్ పెట్టాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ పరిణితిని చూపించాడు. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర యాక్షన్ కింగ్ అర్జున్‌ది. కడలి చిత్రంలో విలన్‌గా నటించిన అర్జున్ తెలుగులో విలన్‌గా చేసిన తొలి తెలుగు సినిమా ఇది. పాత్ర పరంగా అర్జున్ గురించి మంచి చెప్పనక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోయాడు. హీరోకు ఢీ అనే పాత్రలో విలన్ రోల్‌ను తన నటనతో ఎలివేట్ చేశారు. హీరోయిన్ విషయానికి వస్తే, కొత్తమ్మాయి మేఘా ఆకాష్‌కి నటనకు అంతగా ప్రాధాన్యం లేని పాత్ర అయినా పిసినారి అమ్మాయి చైత్ర పాత్రలో క్యూట్ గా కనిపించింది. కొన్ని చోట్ల తొలి రోజుల్లోని శ్రియని గుర్తుకి తెచ్చింది. నితిన్‌తో రొమాంటిక్ సీన్స్‌లో ఆకట్టుకుంది. రవికిషన్, నాజర్, అజయ్, శ్రీరామ్ తదితరులు పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. నిన్నటి తరం హీరోయిన్ పూర్ణిమ హీరో తల్లిగా నటించింది. రాజీవ్ కనకాల హీరోయిన్‌కి తండ్రిగా కనిపించాడు. ఇక ఇంద్రకుమార్, నారద శర్మ అంటూ కామెడీ కోసం అల్లిన పురాణ పాత్రల్లో ప థ్వీ, బ్రహ్మాజీ నవ్వులు పంచారు. నితిన్ ఫ్రెండ్ పాత్రలో మధునందన్ మరోసారి అలరించే ప్రయత్నం చేశాడు. అందాలరాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి తొలి రెండు చిత్రాలకు భిన్నంగా మూడో చిత్రాన్ని మైండ్ గేమ్ జోనర్‌లో ఎంచుకోవడం, దాన్ని బాగా ప్రజంట్ చేయడం విశేషం. స్క్రీన్‌ప్లే, మాటల రచయితగా హను తన మార్క్ చూపించాడు.
'బలహీనత లేని బలవంతుడుని భగవంతుడు కూడా స ష్టించలేదు', 'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా.. ఇంద్రుడు తలచుకుంటే ఇబ్బందులకు కొదువా', 'కోట్ల మంది సైనికులు సరిపోలేదట.. పంచపాండవులు సాధించలేదట.. చివరికి కృష్ణుడు ఒంటరి కాదట.. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తికాదట.. అశ్వత్థామ హతః కుంజర: ' వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాకి హైలెట్‌గా నిలిచిన అంశాలలో ఒకటి. బొంబాయి, శాన్‌ప్రాన్‌సిస్కో, జోర్డాన్, లాస్ వేగాస్.. ఇలా సినిమాలో లోకేషన్లు మారుతూనే ఉన్నా.. అతని సినిమాటోగ్రఫీలో క్వాలిటీ ఎక్కడా మారలేదు. సంగీతం విషయానికి వస్తే.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. పాటల్లో 'మిస్ సన్‌షైన్, బంభట్ పోరి' అలరిస్తాయి. ఇక రీరికార్డింగ్ విషయంలో తనను ఎందుకు కింగ్ అని పిలుస్తారో ఈ సినిమాతో మరోసారి చెప్పకనే చెప్పాడీ రీరికార్డింగ్ స్పెషలిస్ట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగు ప్రేక్షకులు మైండ్ గేమ్ సినిమాలను ఢీ, రెఢీ వంటి చిత్రాల నుండి ఎక్కువగా కమర్షియల్ యాంగిల్‌లో చూస్తూ వస్తున్నారు. 'లై' తరహా సినిమాలు మాత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంట్రవెల్‌లో ఓ ట్విస్ట్‌ని, క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్‌ని జోడించి స్క్రీన్‌ప్లేని ఇంట్రస్టింగ్‌గా నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు హను రాఘవపూడి. చివరిగా మైండ్‌గేమ్ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మంచి సినిమాని ఇచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
బాటమ్‌లైన్: మైండ్ గేమ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షులు బాగా 'లై'క్ చేస్తారు.
Comments