టీడీపీకి షాక్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని స్వాధీనం చేసుకోవాలి.. కేసీఆర్ కు లేఖ
- IndiaGlitz, [Wednesday,June 30 2021]
పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. పార్టీ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా దూరమయ్యారు. క్యాడర్ ఉన్నప్పటికీ నేతలు లేకపోవడంతో తెలంగాణలో టిటిడి పూర్తిగా కనుమరుగవుతోంది. తాజాగా తెలంగాణలో టిడిపికి మరో షాక్ తగిలింది.
హైదరాబాద్ లో ఉన్న టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టిడిపికి వ్యతిరేకంగా మారారు. పలు ఆరోపణలు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
ఇదీ చదవండి: తీవ్ర విషాదం.. నటి కవిత భర్త మృతి, కొడుకు మరణించిన 15 రోజుల్లోనే..
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రభుత్వం నుంచి లీజుకి తీసుకున్న స్థలాన్ని టిడిపి వాణిజ్య కార్యక్రమాలకు వాడుకుంటోంది అంటూ ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటైనప్పటి నుంచి తాము ఇక్కడే పనిచేస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పేర్కొన్నారు. కానీ ఏపీలో మాత్రం టిడిపి ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నారు అని.. ఇక్కడ మాత్రం తమని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడి ఎల్ రమణ అధికారాలు కూడా నామమాత్రమే. ఇక్కడ అంతా ఏపీ నాయకుల పెత్తనమే సాగుతోంది. తమకు జీతాలు కూడా సరిగా అందడం లేదు. కొందరు వయసు పైబడిన ఉద్యోగులు బయట ఉద్యోగాలు చూసుకోలేని పరిస్థితి. దీనితో తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ కేసీఆర్ కు రాసిన లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి ట్రస్ట్ భవన్ పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఇక్కడ వాణిజ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి కేసీఆర్ గారు ఈ విషయంపై ద్రుష్టి పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని స్వాదీనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థనో, ప్రయివేటు సంస్థనో ఏర్పాటు చేసి తాము ఇక్కడే మెరుగైన జీతాలతో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలి అని లేఖలో పేర్కొన్నారు.