హీరో సూర్య కోర్టు ధిక్కారణ చేస్తున్నారంటూ లేఖ!!
- IndiaGlitz, [Monday,September 14 2020]
హీరో సూర్య సినిమాలే కాదు.. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సర్వీస్ చేస్తుంటారు. అంతే కాదండోయ్.. సమాజంలో జరిగే విషయాలపై ఆయన తనదైన రీతిలో ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా హీరో సూర్య నీట్ ఎగ్జామ్‌పై తన స్పందనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వం నీట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుండటంతో ముగ్గురు విద్యార్థులు భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన సూర్య ‘‘నీట్ భయంతో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారనే వార్త నన్ను కలిచి వేసింది. విద్యార్థులు పరీక్షలు రాసి వారి నైపుణ్యాన్ని చూపించుకోవాలి.
అయితే కరోనా సమయంలో పరీక్షలు రాయాల్సి రావడం ఎంతో బాధాకరం. డాక్టర్ కావాలని కలలు కన్న పేద విద్యార్థుల కలల్ని నీట్ చంపేసింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో మేం మౌనంగా ఉండం. కరోనా భయంతో కోర్టులకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా న్యాయవిచారణ చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు విద్యార్థులను మాత్రం నీట్ పరీక్షలకు హాజర అవమని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయి’’ అని సూర్య ఉద్యమానికి పిలుపునిచ్చారు. సూర్య ఎగైనెస్ట్ సూర్య అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కేంద్రం తీరుని కమల్‌హాసన్, మాధవన్ తప్పుపట్టారు.
నీట్ పరీక్షపై సూర్య చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్.సుబ్రమణ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇది తమిళనాట సంచలనంగా మారింది.