మా అన్నయ్య సినిమాలే కాదు నా సినిమానే నేను చూడను - నిహారిక
- IndiaGlitz, [Sunday,June 19 2016]
మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నమెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన చిత్రం ఒక మనసు. ఈ చిత్రాన్నిరామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. హృదయానికి హత్తుకునేలా వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఒక మనసు చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిహారిక తో ఇంటర్ వ్యూ మీకోసం...
మీ ఫస్ట్ ఫిల్మ్ 24న రిలీజ్ అవుతుంది కదా..ఎలా ఫీలవుతున్నారు..?
ఫస్ట్ ఫిల్మ్ కదా.. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను. అయితే..పెద్దగా టెన్షన్ లేదు. కాకపోతే తెర పై ఎలా ఉంటానో చూసుకోవాలని వెయిట్ చేస్తున్నాను.
ఈ మూవీ అంగీకరించడానికి కారణం ఏమిటి..?
చాలా కథలు విన్నాను కానీ...నాకు ఎందుకనో నచ్చలేదు. ఒక మనసు కథ చెప్పినప్పుడు ఈ సినిమాలోని సంధ్య క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మెచ్యూర్డ్ గా ఉండే ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఫ్యామిలీ, ఫ్యాన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని నా నమ్మకం. అందుకనే ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పేసాను.
మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా రావడం కదా..ఈ విషయం చెప్పినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు..?
నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఆతర్వాత సినిమా ప్రొడక్షన్ పై ఇంట్రస్ట్ పెరిగింది. షూటింగ్ కి వెళ్లి అబ్జర్వ్ చేస్తుంటే నాకు ప్రొడక్షన్ మీదే కాకుండా ఏక్టింగ్ మీద కూడా ఇంట్రస్ట్ ఉందని తెలిసింది. నేను ఏక్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యాకా నాన్న, పెదనాన్న మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ తో డిష్కస్ చేసాను. మావాళ్లు అబ్బాయి ఇండస్ట్రీలోకి రావడం ఈజీ. అదే అమ్మాయి అంటే కొంచెం ఇబ్బంది కదా..ఆలోచించు ఉన్నారు. నేను రెడీ.. ఏక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఫైనల్ గా ఓకే అన్నారు.
ఇంతకీ.. ఒక మనసు ఎలా ఉండబోతుంది..?
ఇది ఫ్యూర్ లవ్ స్టోరీ. మరో చరిత్ర సినిమా చూడలేదు కానీ గీతాంజలి చూసాను. ఈ రెండు చిత్రాలకు కాస్త దగ్గరగా ఉంటుంది మా ఒక మనసు.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు సంధ్య. హీరో నాగ శౌర్య క్యారెక్టర్ పేరు సూర్య. సినిమాలో 80% మేమిద్దరమే కనిపిస్తుంటాం. సంధ్య క్యారెక్టర్ కి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను.
ఈ సినిమాలో ఏదైనా మెసేజ్ ఉంటుందా..?
ప్రేమ అంటే కేవలం అమ్మాయి - అబ్బాయి మధ్య ఉండేదే కాదు. ఫాదర్ - డాటర్ మధ్య, ఫాదర్ - సన్ మధ్య ప్రేమ ఉంటుందని ఈ చిత్రంలో చూపించాం.
యాంకర్ గా మోడరన్ గా కనిపించిన మీరు..ఇప్పుడు హీరోయిన్ గా శారీలో కూల్ గా కనిపించడానికి కారణం..?
టీవీలో యాంకర్ గా చేస్తున్నప్పుడు ఒకలా..,సినిమాలో హీరోయిన్ గా మరోలా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి. యాంకర్ అంటే గట్టిగా మాట్లాడాలి. అదే హీరోయిన్ అయితే అంత గట్టిగా మాట్లాడవలసిన అవసరం లేదు. అందుచేత పాత్రకు తగ్గట్టు డ్రెసింగ్ ఉంటుంది.
ఇటీవల ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అయ్యారు కదా..ఎలా ఫీలయ్యారు..?
ఫ్యాన్స్ ని కలిసినప్పుడు వాళ్ళు నాపై చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేను. వాళ్ల మాటలు నాలో చెప్పలేనంత ధైర్యాన్నిఇచ్చాయి. నన్ను ఓ సిస్టర్ లా ఆదరిస్తాం..అండగా నిలుస్తాం అని చెప్పడంతో చాలా హ్యాఫీగా ఫీలయ్యాను.
మీరు హీరోయిన్ గా నటిస్తానంటే ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి..?
హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో ఎలా చూస్తారో తెలిసిందే. నన్ను అలా చూడడం ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. అందుకనే నేను గ్లామర్ రోల్స్ చేయకూడదు. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నాను.
డైరెక్టర్ రామరాజు ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ కాకపోయినా ఆయన డైరెక్షన్ లో చేయడానికి కారణం..?
రామరాజు గారి ఫస్ట్ ఫిల్మ్ చూడలేదు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ అయ్యిందా లేదా అని చూడలేదు. ఆయన చెప్పిన కథ అందులోని నా క్యారెక్టర్ బాగా నచ్చింది. అందుకనే కథ విన్న వెంటనే ఓకే చెప్పేసాను అంతే.
మీరు కావాలనుకుంటే టాప్ స్టార్ తో ఫస్ట్ ఫిల్మ్ చేయచ్చు కానీ...నాగ శౌర్య తో ఫస్ట్ ఫిల్మ్ చేయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
టాప్ హీరోనా, లేక చిన్న హీరోనా అనేది కాదు ముఖ్యం. కథ బాగుండాలి. సినిమా బాగోకపోతే పెద్ద హీరో సినిమా అయినా చూడరు. మా అన్నయ్య సినిమా అయినా సరే...బాగోకపోతే నేను చూడను. మా అన్నయ్య వరకు ఎందుకు నా సినిమా బాగోకపోతే నేనే చూడను. అందుచేత నా దృష్టిలో స్ర్కిప్టే హీరో..!
నాగ శౌర్య తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
నాగ శౌర్య కి కోపం ఎక్కువ. రిజర్వడ్ గా ఉంటాడు. నాకు కొంచెం కష్టం అనిపించిన సీన్స్ లో నటించేటప్పుడు బాగా హెల్ప్ చేసాడు. నైస్ పర్సన్.
ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయా..?
లేవు..అలాంటి సీన్స్ ఉంటే చేయను.
ఒక మనసు చిత్రాన్ని చిరంజీవి గారు చూసారా..?
ఇంకా చూడలేదు. ఈనెల 23న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తాను. కుదరకపోతే 24న చూపిస్తాను.
మెగా హీరోయిన్ అంటే మీకు ఏమనిపిస్తుంది..?
మెగా అనే ట్యాగ్ తీసుకోవడానికి అర్హత ఉండాలి. మెగా అనేది ఒక్కరోజులో వచ్చింది కాదు ఎన్నో రోజులు కష్టపడితే వచ్చింది.
మీ ఫ్యామిలీ హీరోస్ కాకుండా వేరే హీరోల్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం..?
కమల్ హాసన్.
తెలుగులోనేనా వేరే భాషల్లో కూడా నటించే ఆలోచన ఉందా..?
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నాను. తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.