Tirumala: హమ్మయ్య.. చిరుత చిక్కింది: ఊపిరి పీల్చుకున్న టీటీడీ అధికారులు, భక్తులు
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల అలిపిరి మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేయడం, ఆపై అడవిలోకి లాక్కెళ్లేందుకు యత్నించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో చిరుతను బంధించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చిరుతను బంధించారు. నడక దారిలోని 7వ మైలురాయి వద్ద ఇది చిక్కింది. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలో 100కు పైగా కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టుబడిన చిరుతకు ఏడాదిన్నర వయసు వుంటుందని.. ఇప్పుడిప్పుడే వేటాడే లక్షణాలు అలవాటు అవుతున్నాయని, అందుకే చిన్నారిపై దాడి చేసిన సమయంలో భయాందోళనలకు గురై అతనిని వదిలేసినట్లుగా భావిస్తున్నారు. అందుకే బాలుడు క్షేమంగా బయటపడగలిగాడని అధికారులు చెబుతున్నారు. తొలుత పిల్లిని వేటాడుతూ.. ఇది భక్తులు వెళ్లే మార్గంవైపు వెళ్లిందని.. అది తప్పించుకోవడంతోనే బాలుడిపై దాడికి యత్నించిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
గురువారం రాత్రి బాలుడిపై చిరుత దాడి :
కాగా.. గురువారం రాత్రి తిరుమల నడకదారిలో ఆదోనికి చెందిన కుటుంబం నడుచుకుంటూ తిరుమలకు వెళ్తోంది. ఈ క్రమంలో బాధిత బాలుడు తన తాతతో కలిసి దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా చిరుత వచ్చి దాడి చేసింది. అతనిని నోట కరచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటే స్పందించని దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ.. రాళ్లు విసురుతూ, టార్చ్‌లు వేస్తూ దాని వెనుక పరుగులు తీశారు. దీంతో కంగారుపడిన చిరుత.. 7వ మైలురాయి వద్ద బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడ విధుల్లో వున్న భద్రతా సిబ్బంది బాలుడిని రక్షించి వెంటనే పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాలుడి చెవి వెనుక, శరీరంపై మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. చిన్నారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించారు.
భక్తులకు ఈవో సూచనలు :
చిరుత దాడి నేపథ్యంలో ఈవో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత 200 మంది భక్తులను ఒక బృందంలో పంపేలా ఏర్పాటు చేశారు. వీరికి సెక్యూరిటీ గార్డు భద్రతగా వస్తారని, భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ తిరుమల చేరుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని ఈవో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments