Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తులు..

  • IndiaGlitz, [Monday,May 20 2024]

తిరుమలలో మరోసారి చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో సోమవారం మధ్యాహ్నం మెట్ల మార్గం వద్ద రెండు చిరుతలు కనిపించాయి. దీంతో భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. చిరుతలు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే టీటీడీ సిబ్బందితో పాటు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది కూడా చిరుతల జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగింది.

మరోవైపు చిరుతల సంచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నడకదారి గుండా భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. క్యూలైన్లలో ఒంటరిగా వెళ్లవద్దని గుంపులుగా వెళ్లాలంటూ భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాగే ఐదారు రోజుల కిందట కూడా తిరుమల కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వాహనాదారులకు చిరుత కనిపించింది. భక్తులు కారులో వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున చిరుత కారుకు అడ్డొచ్చింది. అయితే రోడ్డు దాటుకుని వెళ్లిపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

కాగా గతేడాది కూడా అలిపిరి నడకమార్గంలోనే చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చిన్నారి మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది చిరుతల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. బోనులు, సీసీటీవీ కెమెరాల ద్వారా వాటిని బంధించి దూరంగా ఉన్న అడవుల్లో వదిలిపెట్టారు. నడకమార్గాన వెళ్లే భక్తులకు చేతి కర్రలు అందించడంతో పాటు గుంపులు గుంపులుగా పంపించారు. దీంతో చిరుతల సంచారం తగ్గిపోయింది.

కానీ మళ్లీ ఇప్పుడు నడకమార్గంలో చిరుత పులులు సంచరించడం భక్తులను భయపెడుతోంది. ఓవైపు వేసవి సెలవులు ఉండటంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కువ మంది భక్తులు అలిపిరి నడకమార్గం ద్వారా కొండపైకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో చిరుతల సంచారం లేకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.