Vani Jairam : చిత్ర సీమకు మరో విషాదం.. లెజండరీ సింగర్ వాణీ జయరామ్ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,February 04 2023]

ఇప్పటికే జమున, సాగర్, కే విశ్వనాథ్‌ల మరణాలతో శోకసంద్రంలో మునిగిపోయిన చిత్రసీమకు మరో షాక్ తగిలింది. లెజండరీ సింగర్ వాణీ జయరాం ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాంకి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ వాణీ జయరాం ప్రస్థానం:

1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు వాణీ జయరాం. తల్లీదండ్రులు దురైస్వామి అయ్యంగార్, పద్మావతి. తఆమె అసలు పేరు కళైవాణీ. ఆమె తల్లీదండ్రులకు ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వీరిలో వాణీ జయరామ్ ఐదవ సంతానం. ముత్తుస్వామి దిక్షితార్ వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దిన వాణీ జయరాం అనంతరం కడలూర్ శ్రీనివాస్ అయ్యంగార్, టీఆర్ బాలసుబ్రమణ్యన్, ఆర్ఎస్ మణి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సిలోన్ రేడియోలో కొంతకాలం పనిచేసిన ఆమె తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియాలో తన తొలి ప్రదర్శన ఇచ్చారు వాణీ జయరాం. మద్రాస్ యూనివర్సిటీ అనుబంధ క్వీన్స్ మేరీ కాలేజ్‌లో చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంత కాలం పాటు పనిచేశారు. అయితే అత్తింటి వారి మద్ధతుతో వాణీ జయరాం తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. పెళ్లి తర్వాత ముంబైకి మారడం ఆమె దశ తిప్పింది. కెరీర్‌లో పలు భాషల్లో మొత్తం 10,000కి పాటలు పాడారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను వాణీ జయరాంకు మూడు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, మూడు సార్లు ఫిల్మ్‌ఫేర్, గుజరాత్, తమిళనాడు, నంది, ఒడిషా రాష్ట్రాల అవార్డులు వరించాయి.