లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు
- IndiaGlitz, [Friday,September 25 2020]
గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు. కోట్లాది హృదయాల్లో చిచ్చు పెట్టే ఈ వార్తను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. మధ్యాహ్నం 1.04 గం.కు స్వర్గస్తులైనట్లు చరణ్ మీడియా ఎదుట ప్రకటించారు. నాన్న గారు కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కోట్లాదిమంది అభిమానులకు ధన్యవాదాలు చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తతో దేశం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్ట్ 5న ఎస్పీ బాలు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అప్పటి నుంచి ఆయనను ఐసీయూలో ఎక్మో సాయంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బాలు క్రమక్రమంగా కోలుకుంటూ వస్తున్నారు.
అంతా బాగానే ఉంది త్వరలో బాలు డిశ్చార్జ్ అవుతారని ఆయన అభిమానులంతా భావిస్తున్న సమయంలో హఠాత్తుగా మరో న్యూస్. బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు గురువారం సాయంత్రం వెల్లడించాయి. నేడు ఆయన పరమపదించారని ఆయన కుమారుడు చరణ్ వెల్లడించడంతో కోట్లాది హృదయాలు బాధతో తల్లడిల్లిపోతున్నాయి.