లెజండరీ దర్శకనిర్మాత విసు కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,March 22 2020]

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్‌, నిర్మాత, ద‌ర్శకుడు విసు ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దివంగ‌త ద‌ర్శకుడు కె.బాల‌చంద‌ర్ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1945లో జ‌న్మించిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించి.. మరెన్నో కథలు రాశారు. కాగా.. ఈయ‌నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విసు ఇక లేరన్న విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విసు దర్శకుడిగా ఎన్నో చిత్రాలకు స్క్రిప్ట్స్, డైలాగ్స్ రాశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాలకు ఆయన స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు.. ఆ సినిమాలో విసు కూడా నటించారు. ఈయన రాసిన కథల్లో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు, సమాజం గురించి, వారి జీవితాల గురించే ఉంటాయి. అలా సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన 2016 లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎక్కువగా జాతీయత, ఆధ్యాత్మికతను నమ్ముతున్నందున కాషాయ కండువా కప్పుకున్నారు.