K Viswanath : భర్త అడుగుజాడల్లో భార్య.. కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
రోజుల వ్యవధిలో కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మీ (86)కన్నుమూశారు. ఆదివారం ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ జయలక్ష్మీ కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ నెల 3న కన్నుమూసిన కే.విశ్వనాథ్:
కాగా.. ఈ నెల 3న దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (92) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విశ్వనాథ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే విశ్వనాథ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇది విశ్వనాథ్ ప్రస్థానం:
1930 ఫిబ్రవరి 19న అప్పటి గుంటూరు జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ . గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్, ఏసీ కాలేజీలో బీఎస్సీ అభ్యసించారు. ఆయన తండ్రి మద్రాస్‌లోని విజయవాహినీ స్టూడియోలో పనిచేశారు. దీంతో విశ్వనాథ్ సైతం విజయవాహినీలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ బైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. అలా సినీ రంగంలోని అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా మారారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, ఆపద్భాంధవుడు, శంకరాభరణం వంటి ఆణిముత్యాలను టాలీవుడ్‌కు అందించి తెలుగు చిత్రసీమకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు. తన సినీ ప్రస్థానంలో 50కి పైగా సినిమాలకు దర్శకత్వంలో వహించారు విశ్వనాథ్. ఇందులో 9 హిందీ సినిమాలు కూడా వున్నాయి. మూసలో వెళ్తున్న తెలుగు చిత్ర సీమకు ఆయన కొత్త దిశను చూపారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి నటుడిగా అవతారమెత్తారు విశ్వనాథ్. అలా తెలుగు, తమిళ భాషల్లో 30 వరకు సినిమాల్లో నటించారు.
సినీ రంగానికి విశ్వనాథ్ చేసిన కృషికి గాను.. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డ్, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాలు ఆయనను వరించాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. ఇక విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. అలాగే స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల వంటి చిత్రాలు ఆసియా పసిఫిక్ చలనచిత్రాలు ప్రదర్శితమయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments