K Raghavendra Rao:ఏపీ అంధకారంలో వుంది.. చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి : కే. రాఘవేంద్రరావు పోస్ట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మోత మోగిద్దాం అంటూ చేసిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీనికి కొనసాగింపుగా ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీడీపీ. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7.05 వరకు ఇంట్లో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, ఫ్లాష్ లైట్ల ద్వారా నిరసన తెలియజేశారు తెలుగుదేశం శ్రేణులు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ నుంచి స్పందనలు రావడం లేదు. ఏపీలో వైసీపీ అధికారంలో వుండటంతో తమను కూడా తర్వాత టార్గెట్ చేస్తారని, సినిమాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ ప్రముఖులు భయపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితులు, దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడంతో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందన్నారు.
తాజాగా శనివారం టీడీపీ పిలుపునిచ్చిన ‘‘కాంతితో క్రాంతి’’ నిరసన కార్యక్రమంలో రాఘవేంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో తన కార్యాలయంలో లైట్లు ఆపేసి దీపం వెలిగించారు. ఈ మేరకు దీపపు వెలుగులో భగవంతుడిని ప్రార్థిస్తున్న ఫోటోను దర్శకేంద్రుడు పోస్ట్ చేశారు. ‘‘ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో వుంది.. చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి ’’ అని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్ర రాష్ట్రం అందకారం లో ఉంది.. చంద్రుడు రావాలి వెలుగు తేవాలి. pic.twitter.com/RLx9jMOuDO
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments