Directors Day : దర్శకరత్న దాసరి జయంతి .. నేడు డైరెక్టర్స్ డే, దర్శకుడికి స్టార్ స్టేటస్ తెచ్చిన మహనీయుడు
- IndiaGlitz, [Thursday,May 04 2023]
దర్శకరత్న దాసరి నారాయణరావు.. ఈ పేరు తెలియనివారుండరు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. తెలుగు తెరపై హీరోలు రాజ్యమేలుతున్న దశలో దర్శకుడికి స్టార్ స్టేటస్ తెచ్చిన అరుదైన ఘనత దాసరి సొంతం. ఒకటి రెండు సినిమాలు తీయడానికి అపసోపాలు పడుతున్న నేటీ రోజుల్లో.. ఏకంగా 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ‘‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’’లో స్థానం సంపాదించారు దాసరి.
సామాజిక అంశాలను స్పృశించిన దాసరి :
సామాజిక అంశాలనే ఇతివృత్తాలుగా చేసుకుని సినిమాలను తెరకెక్కించారు. సినిమా అనే శక్తివంతమైన ఆయుధం ద్వారా అవినీతి, లింగ వివక్ష, కుల వివక్ష వంటి సామాజిక అంశాలపై ప్రశ్నలు సంధించారు. 1974లో రాజబాబు హీరోగా ‘‘తాతా మనవడు’’ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించిన దాసరి తొలి సినిమాకే నందిని అందుకున్నారు. చివరిసారిగా ఎర్రబస్సు చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరి చూపు దాసరి వైపే. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. కెరీర్‌లో 9 నందులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా మరెన్నో పురస్కారాలను కైవసం చేసుకున్నారు.
డైరెక్టర్స్ డే గా దాసరి జయంతి :
ప్రతిభావంతులైన ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను దాసరి నారాయణరావు టాలీవుడ్‌కు అందించారు. నేడు ఆ దిగ్గజ దర్శకుడి పుట్టినరోజు. ఆయన జయంతిని ‘‘డైరెక్టర్స్ డే’’గా ప్రకటించింది టాలీవుడ్. ఈ సందర్భంగా ఆ మహానీయునికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ‘‘ ఆయన మనపై చూపిన ప్రభావానికి ఎలాంటి వివరణ అక్కర్లేదు. ఎందరికో ఆయన ఆదర్శనీయులు. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వందనం ’’.