Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణ అస్తమయం.. శోకసంద్రంలో టాలీవుడ్

  • IndiaGlitz, [Tuesday,November 15 2022]

దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో వున్నారు. అయితే వైద్యులు సీపీఆర్ చేసి కృష్ణను కాపాడారు. నాటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయిన మహేశ్‌ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కృష్ణ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కృష్ణ ప్రస్థానం:

1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుండగా.. ఏలూరులో చదువుతుండగా అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానాన్ని చూసి తాను కూడా నటుడిని కావాలని కృష్ణకు బలంగా నాటుకుపోయింది. మద్రాసులో తెలిసిన వారి ద్వారా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘‘తేనే మనసులు’’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇక వెను దిరిగి చూసుకోలేదు. ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో 340కి పైగా సినిమాల్లో నటించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మాలయా స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణంతో పాటు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు.

తెలుగు తెరకు సాంకేతికతను అందించిన కృష్ణ:

నేడు తెలుగు సినిమా ఈ స్థాయిలో వుందంటే అందుకు కృష్ణ కూడా కీలకపాత్ర పోషించారు. కొత్త సాంకేతికతలు, జానర్‌లను ఆయన పరిచయం చేశారు. తొలి తెలుగు జేమ్స్ బాండ్ (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్ స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం (సింహాసనం), తొలి డీటీఎస్ (తెలుగు వీర లేవరా) వంటి చిత్రాల్లో కృష్ణ నటించారు.

రాజకీయ రంగ ప్రవేశం:

దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ.. 1989లో ఆ పార్టీ నుంచి ఏలూరు లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతగా అప్పటి తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ విధానాలను విమర్శిస్తూ సినిమాలు తీసి సంచలనం సృష్టించారు. వయసు రీత్యా సినిమాలకు దూరంగా వుంటూ వస్తోన్న కృష్ణ.. 2016లో శ్రీశ్రీ చిత్రంలో చివరిసారిగా నటించారు. ఇక భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, ఫిల్మ్‌ఫేర్ సౌత్ లైఫ్ టైం అచీవ్ మెంట్ ‌అవార్డ్‌ అందుకున్నారు.

కుటుంబం :

కృష్ణ 1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల , ప్రియదర్శిని. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ బాబు కొద్దికాలం పాటు హీరోగా పలు సినిమాలు చేసి తర్వాత నిర్మాతగా మారారు. రెండవ కుమారుడు మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు. పెద్ద కుమార్తె పద్మావతి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సతీమణి. మరో కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు సతీమణి. ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్‌ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది.

More News

Japan: 'జపాన్' ఫస్ట్ లుక్ విడుదల

హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'జపాన్'.

'ERROR 500' ట్రైలర్ లాంచ్

మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ),

Sumanth: సుమంత్ హీరోగా డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ 'వారాహి'

వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు.

BiggBoss: లాస్ట్ మినిట్ వరకు టెన్షన్.. మెరీనా సేఫ్, వాసంతి ఎలిమినేట్

సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఈవారం డబుల్ ఎలిమినేషన్ షాకిచ్చాడు బిగ్‌బాస్.

ఆసుపత్రికి మహేశ్, సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులు ... కృష్ణగారికి ఏమైంది...?

దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ ఆసుపత్రి పాలైనట్లు వార్తలు రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.