Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో మరో విషాదం.. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటులు కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. ఆ తరానికి ప్రతినిధిగా వున్న మరో నట దిగ్గజం , నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇది కైకాల ప్రస్థానం:
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోని కౌతవరం గ్రామంలో 1935లో సత్యనారాయణ జన్మించారు. గుడివాడలో డిగ్రీ చదువుకున్నారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. అనంతరం నటనపై ఆసక్తితో ఎన్నో నాటకాలలో ప్రదర్శనలు ఇచ్చారు. కైకాలలోని నటనా ప్రతిభను గుర్తించిన నిర్మాత డీఎల్ నారాయణ ‘‘సిపాయి కూతురు’’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత సత్యనారాయణ వెనుదిరిగి చూసుకోలేదు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా అన్ని విభాగాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న కైకాలను ‘‘నవరస నటనా సార్వభౌమ’’ బిరుదు వరించింది.
60 ఏళ్ల సినీ కెరీర్ :
60 సంవత్సరాల సుధీర్ఘ ప్రస్థానంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు. రాజకీయాలపై ఆసక్తితో 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.
మూడు తరాల నటులతో నటించిన కైకాల :
దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల తరంతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ల చిత్రాల్లోనూ నటించారు. ఈ జనరేషన్‌తోనూ ఆయన స్క్రీన్ చేసుకున్నారు. చివరిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షిలో కనిపించిన కైకాల.. తర్వాత అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా వున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments