నాగోబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నేతలు
Send us your feedback to audioarticles@vaarta.com
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా నిలిచింది. నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తారు. ప్రతి రెండేళ్లకు ఓసారి జరిగే ఈ జాతరలో గిరిజనులే కాకుండా రాజకీయ నేతలు కూడా ఆ నాగశేషుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా ఆ దైవాన్ని దర్శించుకున్న నేతలు ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్నారు. పుష్యమాసం అమావాస్య అర్థరాత్రి వేళ గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర మేస్రం వంశీయుల అతి పెద్ద పండుగగా విరాజిల్లుతోంది. నాగోబా జాతర సమయంలో ఆదివాసీలే కాకుండా ఆదివాసీయేతరులు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి నాగశేషుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటిసారి 1995లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు నాగోబాను దర్శించుకున్నారు. అప్పుడు నాగోబా ఆలయం శిథిలావస్థలో ఉండటంతో ఆలయ అభివృద్దికి కోటి రూపాయల నిధులను విడుదల చేశారు. ఆ తర్వాత 2001లో అప్పటి సీఎం చంద్రబాబు.. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కెస్లాపూర్‌లో పర్యటించారు. నాగోబాను దర్శించుకుని ఆదివాసీ గిరిజనుల ప్రగతి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అనంతరం 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నాగోబాను దర్శించుకున్నారు.
ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకోబుతున్నారు. తొలిసారిగా ఎంపీగా ఉన్న సమయంలో 2021 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలానికి వచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు రేవంత్. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక ఆగస్టు 9, 2021న ఇంద్రవెల్లిలో నిర్వహించిన ‘దళిత-గిరిజన’ దండోరా భారీ బహిరంగ సభకు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ముచ్చటగా మూడోసారి 2022 జనవరి 29న నాగోబాను దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.40లక్షలు అందజేశారు.
అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నాగోబా దర్శనానికి రావాలని మెస్రం వంశస్థులు ఆశీస్సులు అందించారు. వారి ఆశీస్సులు ఫలించి ఇప్పుడు సరిగ్గా రెండేళ్లకు తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా నాగోబాను దర్శించుకోబోతున్నారు. అలాగే రేపు(శుక్రవారం) ఇంద్రవెల్లిలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రిగా తొలి పర్యటనం కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభ నుంచే లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ఈ సభలో ఆరు గ్యారంటీల హామీల అమల్లో భాగంగా మరో రెండు పథకాలను ప్రకటించనున్నారు. ఇలా దిగ్గజ నేతలు నాగోబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com