ఆర్జీవీకి కరోనా.. నల్లగొండ కోర్టుకు వెల్లడించిన లాయర్

తాను సూపర్ ఫైన్‌గా ఉన్నానని.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ అంటూ నిన్న డంబెల్స్ పట్టుకుని ట్విట్టర్‌లో హంగామా చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్ అట. ఇది ఆయన లాయర్ నల్లగొండ కోర్టుకు స్వయంగా వెల్లడించిన మాట. ‘మర్డర్’ అనే చిత్రాన్ని వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్యను కథాంశంగా తీసుకుని వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అసలు కథకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ.. ఐడియాను మాత్రమే తీసుకున్నానని కథ ప్రణయ్, అమృతకు సంబంధించింది కాదని బుకాయించారు.

అయితే మర్డర్ సినిమా విడుదలపై అమృత నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని వర్మ న్యాయవాదిని కోర్టు వివరణ కోరింది. తన క్లయింట్‌ రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణకు 14కి వాయిదా వేసింది. మరి ఆ రోజైనా వర్మ కోర్టుకు వస్తారో లేదో చూడాలి.

కాగా.. నిన్న వర్మ ట్విట్టర్‌లో డంబెల్స్‌తో జిమ్ చేస్తూ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ''నేను విపరీతమైన జ్వరంతో అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. నిజం ఏంటంటే.. నేను ఫిట్‌గా ఆరోగ్యంగా ఉన్నా. ఇంట్రస్టింగ్ సినిమాలను తెరకెక్కిస్తున్నందున నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్నా. నేను అనారోగ్యంతో ఉన్నానని భావిస్తున్న వాళ్లందరినీ డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. సూపర్ ఫైన్’’గా ఉన్నాను అని వర్మ తెలిపారు.