తండ్రి దశాబ్దాల కల నెరవేర్చిన పార్టీకి వెన్నుపోటు.. దేవరాయులు తీరుపై ఆగ్రహం..
- IndiaGlitz, [Wednesday,January 24 2024]
నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసిన విధానం చూస్తే టీడీపీతో కలిసే ప్రణాళికలో భాగమే అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఎంపీ అయిన దగ్గరి నుంచి టీడీపీలో చేరుందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య రాజకీయంగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
జగన్ ఆశీస్సులతో తీరిన కల..
అనంతరం లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన పార్టీ తరపున పోటీ చేశారు. 1996 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా లోక్‌సత్తా తరపున పోటీ చేసి మరోసారి ఓటమినే చవిచూశారు. దీంతో నాలుగు దశాబ్దాలుగా చట్ట సభల్లోకి అడుగుపెట్టాలనే ఆయన కోరిక కలగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఆశీస్సులతో రత్తయ్య కల నెరవేరింది. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,53,978 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
కమ్మ నాయకులను టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం..
1989 నుంచి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థాయి భారీ మోజార్టీ ఏ పార్టీకీ రాలేదు. దశాబ్దాల రత్తయ్య కల నెరవేర్చిన వైసీపీకి ఇప్పుడు ఆయన కుమారుడు వెన్నుపోటు పొడిచారు. పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంపీగా ఈ ఐదేళ్లలో కేవలం తన సామాజిక వర్గం వారికే దేవరాయులు పెద్ద పీట వేశారని స్థానిక నేతలు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్.. వినుకొండ నుంచి మల్లికార్జునరావుతో పాటు పార్టీలో ఉన్న కమ్మ నాయకులను గంపగుత్తిగా టీడీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పార్టీ పెద్దలు అలర్ట్ అయి నాయకులను అప్రమత్తం చేశారు.
బీసీల వ్యతిరేకి అని పరోక్ష వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలో ఈనెల 18న చంద్రబాబు, లోకేష్‌ను, ఏబీఎన్ రాధాకృష్ణను కలిసి మంతనాలు జరిపారు. అప్పుడే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీఎం జగన్‌కు తెలిసిపోయింది. దీంతో లావుకు నరసరావుపేట ఎంపీ సీటు కేటాయింపుపై ఆచితూచి అడుగులేశారు. అందుకే బీసీలకు టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేదని ప్రెస్మీట్లో పరోక్షంగా లావు చెప్పేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నా కూడా అంగీకరించలేదు. దాంతో తన కులానికి చెందిన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాయని చెప్పి ఉంటే బాగుండేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.