ఆ సినిమాలో అవకాశం వస్తే...ఎంత చిన్న పాత్ర అయినా చేస్తా - హీరోయిన్ లావణ్య త్రిపాఠి
- IndiaGlitz, [Tuesday,December 15 2015]
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక లావణ్య త్రిపాఠి. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న లావణ్య ఆతర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్..చిత్రాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.త్వరలో లచ్చిందేవికి ఓ లెక్కుంది, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. డిసెంబర్ 15 లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా కథానాయిక లావణ్య త్రిపాఠి తో ఇంటర్ వ్యూ మీకోసం...
భలే భలే మగాడివోయ్ తో సక్సెస్ సాధించారు. ఈ రేంజ్ సక్సెస్ ఊహించారా..?
భలే భలే మగాడివోయ్ సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాను. దూసుకెళ్తా తర్వాత అన్ని అటువంటి కథలే చెప్పారు. అందుచేత ఆలస్యం అయినా ఫరవాలేదు. మంచి పాత్ర చేయాలనుకున్నాను.ఎదురు చూసినందుకు భలే భలే మగాడివోయ్ లో మంచిపాత్ర లభించింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ అంత పెద్ద సక్సెస్ కావడం చాలా సంతోషం కలిగించింది.
లచ్చిందేవికి ఓ లెక్కుంది లో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
లచ్చిందేవికి ఓ లెక్కుంది క్రైమ్ కామెడీతో సాగే డిఫరెంట్ మూవీ. ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాను. అంకాలమ్మ అనే పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. అందర్నీభయపెట్టేలా ఓ పాట ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను.
సొగ్గాడే చిన్ని నాయనా లో మీ క్యారెక్టర్ గురించి..?
ఈ సినిమాలో సంప్రదాయంగా సినిమా అంతా చీరలోనే కనిపిస్తాను. అమ్మాయిలు చీరలో చాలా అందంగా కనిపిస్తారు కదా..నా పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా నాకు ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది.
నాగార్జున తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ .?
నా ఫేవరేట్ హీరోగా నాగార్జున సార్. అలాంటిది ఆయనతో కలసి నటించడం అంటే అంత కన్నా కావలసింది ఏముంటుంది. సెట్ లో చాలా కూల్ గా ఉంటారు. నాగ్ సార్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ లైఫ్ లో మరచిపోలేను.
నాగ్ తో నటించారు కదా...చైతు తో నటిస్తారా..?
సొగ్గాడే చిన్ని నాయనా సినిమా కన్నా ముందే మనం సినిమాలో చైతన్య తో కలసి నటించాను. చైతన్యతో అవకాశం వస్తే మళ్లీ నటిస్తాను. అఖిల్ తో అవకాశం వచ్చినా నటిస్తాను. నాకు క్యారెక్టర్ నచ్చితే ఎవరితోనైనా నటిస్తాను.
బాహుబలి 2 లో మీరు నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి..నిజమేనా..?
బాహుబలి 2 లో నేను నటిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు. ఒకవేళ బాహుబలి 2 లో నటించే అవకాశం వస్తే..ఏ పాత్ర అయినా, అది ఎంత చిన్న పాత్ర అయినా సరే వెంటనే ఓకె చెప్పేస్తాను.
సినిమా అంగీకరించే ముందు మీ ప్రాధాన్యత దేనికి కథా..? డైరెక్టర్..? నిర్మాతా..?
నేను ఏ సినిమా చేయడానికైనా ఓకె చెప్పేముందు కథ ఎలా ఉంది..? అందులో నా పాత్ర ఎలా ఉంది..? అనేది చూస్తాను. ఆతర్వాత డైరెక్టర్ ఎవరనేది చూస్తాను. కథ, డైరెక్టర్...ఈ రెండు ద్రుష్టిలో ఉంచుకునే సినిమా అంగీకరిస్తాను.
హైదరాబాద్ ఎలా ఉంది..?
నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కొంటాను. హైదరాబాద్ ఉలవచారు బిర్యాని బాగా ఇష్టం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
అల్లు శిరీష్ తో ఓ మూవీ చేస్తున్నాను. ఈ చిత్రంలో కాలేజ్ గాళ్ గా నటిస్తున్నాను. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో రూపొందుతుంది. నా క్యారెక్టర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది.